కరోనా చర్యలు కాంగ్రెస్‌కు పట్టవా !

by Shyam |
కరోనా చర్యలు కాంగ్రెస్‌కు పట్టవా !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడికి ఏప్రిల్ 14వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో అధికార టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా సమీక్షల్లో పాల్గొంటూ ఎవరికి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇదే క్రమంలో ప్రభుత్వంపై ప్రతి విషయంలో దుమ్మెత్తి పోసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎక్కడికెళ్లార్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి వినపడుతోంది.

ఓ వైపు పోలీసులు రోడ్లను దిగ్బంధిస్తూ జనాలు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటుండగా కొందరు రాజకీయ నేతలు, సీని ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తూ ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటూనే, పరిస్థితిని బట్టి లాఠీ ఛార్జీ చేసి కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాదించిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనక పోవడంతో ప్రజలతో పాటు, రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్న వాదనలు వస్తున్నాయి.

కరోనా వైరస్ విజృంభన రాష్ట్రంలో ఎక్కువైనప్పటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారే తప్ప నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు లేవు. అటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డిది సైతం ఇదే సీన్. ప్రతిరోజు పదవుల కోసం పోటీ పడే నాయకులు, ప్రజా సేవ అనేసరికి ఎక్కడికి వెళ్తున్నారన్న ప్రశ్నలు సామాన్యుల వస్తున్నాయి. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆర్ధికసాయం చేస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ అడుగు ముందుకేసి రెండు నెలల జీతం రూ.5లక్షలు ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags : Corona Virus, April 14th, Pm Modi, Cm KCR, TRS, Ministers, MLAs, Congress, Uttam Kumar Reddy, Komatireddy

Advertisement

Next Story