ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొన్నది నిజం కాదా..?

by Shyam |
MP Uttam Kumar Reddy
X

దిశ, హుజూర్ నగర్: ప్రతిపక్షాలు ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పెగాసిస్ లాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్‌ను ఇజ్రాయిల్ నుండి కొనుగోలు చేసిందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని ఇందిరా భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం స్పెషల్ సాఫ్ట్ వేర్‌తో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేయడానికి దళిత బంధు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

దళిత కుటుంబాలలో ఒక్క శాతం మందికి కూడా 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. అరశాతం ఉన్న సామాజిక వర్గానికి అధిక మంత్రి పదవులు ఇచ్చారని, జనాభా ప్రాతిపదికన 16 శాతం ఉన్న మాదిగలకు న్యాయం జరగలేదన్నారు. దళిత బంధు కోసం అవసరమైన లక్షన్నర కోట్లు సిద్ధం చేశాకనే..పథకం గురించి మాట్లాడాలని సీఎంకు సవాల్ విసిరారు. దళిత సాధికారికత కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ స్లబ్ ప్లాన్ నిధులు ఎందుకు పక్కకు మళ్లీస్తున్నారని ప్రశ్నించారు. పెగాసిస్ సాఫ్ట్ వేర్‌తో కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీతో పాటు మరికొందరి జర్నలిస్టుల ఫోన్ల ట్యాంపింగ్‌కు పాల్పడుతుందన్నారు. అదేవిధంగా సాగర్ ఎడమ కాల్వ నీటిని తక్షణమే విడుదల చేయాలన్నారు.

హామీలు అమలు చేయరా..?

హుజూర్ నగర్ పట్టణంలోని మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణాలపై మంత్రులు హామీ ఇచ్చినా.. ఎందుకు పూర్తి కాలేదని ఎంపీ ఉత్తమ్ ప్రశ్నించారు. శాండ్,లాండ్,మైన్స్,వైన్స్ లలో జిల్లా యంత్రాంగం భాగస్వాములుగా మారుతున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. స్థానికంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నియోజకవర్గ స్థాయిలో కోర్ కమిటీ వేసి,మండల,పట్టణ,గ్రామ స్థాయి కమిటీలు వేస్తామన్నారు.సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన్నీరు మల్లిఖార్జున్,సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు,నిజాముద్ధీన్,అజీజ్ పాషా,కొణతం చిన వెంకటరెట్టి,భూక్యా మంజునాయక్,బాచిమంచి గిరిబాబు,షేక్ సైదా,వల్లపుదాసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed