ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారినే గెలిపించండి: ఉత్తమ్

by Shyam |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారినే గెలిపించండి: ఉత్తమ్
X

దిశ, నల్లగొండ : స‌ర్కార్‌ను ప్రశ్నించే గొంతు‌కలైన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప‌ట్టభద్రుల‌ను కోరారు. బుధవారం న‌ల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌‌లో ప‌ట్టభ‌ద్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అందరి బతుకులు మారుతాయనుకుంటే నాలుగు కోట్ల మంది ప్రజల నోట్లో మ‌ట్టి కొట్టి కేసీఆర్ కుటుంబ స‌భ్యులు మాత్రమే బాగుప‌డుతున్నార‌ని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ తీరుకు ప్రశ్నించే గొంతుకలు అవసరమని, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 77 అసెంబ్లీ స్థానాలు ప్రభావితం అవుతాయ‌ని, అందుకు ఓటు వేసే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకొని సరైన పార్టీని ఎంచుకోవాలని పట్టభద్రులకు సూచించారు.

ఆరేళ్లుగా యూనివ‌ర్సిటీల‌కు వీసీలు లేకున్నా ప‌ల్లా ఏ రోజూ ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని క‌ట్టాల్సింది పోయి బాగున్న స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి రూ. వేల కోట్లు వృథా చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.30ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన‌ట్లు మాయ‌మాట‌లతో కేటీఆర్ ప్రజలను మ‌భ్యపెడుతున్నార‌ని, ఇంకా 1.93 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిపై ఎలాంటి ప్రకటన చేయ‌క‌పోవ‌డం విడ్డూర‌మ‌న్నారు. రాష్ట్రంలో కొందరు ఉద్యోగ సంఘల నేత‌లు స‌ర్కార్‌కు అమ్ముడుపోయి వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల‌కు న్యాయం జ‌రగాలన్నా, యువ‌త‌కు ఉద్యోగాలు రావాల‌న్నా కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయ‌క్‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story