ఎయిర్ఇండియా ఆస్తుల జప్తు ప్రక్రియకు బ్రేక్

by Harish |   ( Updated:2021-09-26 05:26:01.0  )
ఎయిర్ఇండియా ఆస్తుల జప్తు ప్రక్రియకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వం, కెయిర్న్ ఎనర్జీ సంస్థల మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్బిట్రేషన్ అవార్డు కోసం అమెరికాలో ఉన్న భారత ప్రభుత్వ ఎయిర్ ఇండియా ఆస్తులను జప్తు చేసుకోవాలని భావించిన కెయిర్న్ ఎనర్జీ ప్రయత్నాలను అమెరికా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికాలోని న్యూయార్క్ కోర్టు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

భారత్‌తో పన్ను వివాదం కారణంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) కోర్టు తీర్పు ఆధారంగా కెయిర్న్ ఎనర్జీకి 1.2 బిలియన్ డాలర్లు(రూ. 8,800 కోట్లు) అందాల్సి ఉంది. దీనికోసం అమెరికాలో ఉన్న ఎయిర్ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఇదే సమయమో భారత ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ పన్నును రద్దు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని, ఆ సమయం వరకు స్టే విధించాలని కోరింది. ఈ కారణంగానే న్యూయార్ కోర్టు ఎయిర్ఇండియా ఆస్తుల జప్తును తాత్కాలికంగా నిలిపేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, 2006లో అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారం గురించి కేంద్ర పన్నుల విభాగం కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై రూ. 10,247 కోట్ల పన్నులను చెల్లించాలని 2015లో కోరింది. అంతకుముందు 2011లో కెయిర్న్ ఎనర్జీ సంస్థ తన అనుబంధ కెయిర్న్ ఇండియాను వేదాంత సంస్థకు విక్రయించేసింది. ఇందులో భాగంగా వేదాంతకు ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటుగా 5 శాతం వాటా దక్కింది. పన్నులకు సంబంధించి వేదాంతలో ఉన్న ఆ 5 శాతం వాటాను కేంద్రం అటాచ్ చేసింది. దీంతో పాటు రూ. 1,140 కోట్ల డివిడెండ్లు, రూ. 1,590 కోట్ల పన్ను రీఫండ్లను నిలిపేసింది. ఈ అంశంపైనే కెయిర్న్ ఎనర్జీ సంస్థ ఆర్బిట్రేషన్ కోర్టుకెళ్లింది.

Advertisement

Next Story

Most Viewed