- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యుద్ధం వీడి.. ‘శాంతి’ దరికి
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా, తాలిబన్‌లకు మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. మారణహోమాలు, రక్తపాతాలతో తల్లడిల్లిన అఫ్ఘనిస్తాన్‌లో త్వరలో శాంతి కపోతం స్వేచ్ఛగా ఎగరనుంది. రెండు దశాబ్దాలుగా రక్తమోడిన ఈ దేశం.. రాజకీయం, శాంతి, స్వేచ్ఛలవైపు స్థిరంగా అడుగులు వేస్తున్నది. ఖతర్‌లో అమెరికా, తాలిబన్‌లకు మధ్య శనివారం జరిగిన శాంతి ఒప్పందంతో దాదాపు 19 ఏళ్లుగా సాగిన ‘యుద్ధాన్ని’ ముగించేందుకు ముందడుగు పడినట్టయింది. అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్, తాలిబన్ ప్రతినిధి ముల్లా బరదర్‌లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచదేశాలు స్వాగతిస్తున్నాయి. అఫ్ఘనిస్తాన్‌లో శాంతి వెల్లివిరియాలని ఆశిస్తున్నాయి.
అమెరికాలో 2001లో ఉగ్రసంస్థ అల్ ఖైదా(అఫ్ఘనిస్తాన్ బేస్) నేతృత్వంలో జరిగిన మారణహోమాని(9/11 దాడులు)కి ప్రతిగా.. యూఎస్ సహా నాటో బలగాలు అఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదుల ఏరివేతకు సిద్ధమయ్యాయి. 2001 నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2018లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో తాలిబన్‌లతో శాంతి చర్చలు జరిపేందుకు నిర్ణయించింది. దాదాపు 18 నెలలుగా సాగుతున్న ఈ చర్చల్లో భాగంగానే శనివారం ఖతర్‌లో అమెరికా, తాలిబన్‌లకు మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ముఖ్యంగా నాలుగు ప్రధానాంశాలపై కుదిరింది. 14 నెలల్లో అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సహా నాటో బలగాల ఉపసంహరణ, యూఎస్‌కు ముప్పు తెచ్చే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమివ్వదన్న తాలిబన్ హామీ, అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో మార్చి 10లోపు చర్చల ప్రారంభం, శాశ్వతంగా కాల్పలు, పేలుళ్లకు తాలిబన్ స్వస్తి పలకాలన్న నాలుగు ప్రధానాంశాలపై అమెరికా, తాలిబన్‌లు సంతకం పెట్టారు.
ఈ ఒప్పందం అఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొల్పుతుందని, ఇతర దేశాల్లోనూ శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ఉపకరిస్తుందని ప్రశంసించాయి. ఐరాస సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిర రాజకీయ వాతావరణానికి ఇది దోహదపడుతుందని, హింసకు ముగింపు పలకాల్సిన అవసరమున్నదని అన్నారు. శాంతి పునస్థాపితమయ్యేవరకు ఈ కృషి ఇలాగే సాగాలని అభిలాషించారు.
ఖతర్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మన్ అల్ థాని మాట్లాడుతూ.. ఇరుపక్షాల ఒప్పందానికి ఖతర్ మధ్యవర్తిత్వం విజయవంతమవుతున్నదని అన్నారు. ఈ ముందడుగు చారిత్రాత్మకమని తెలిపారు. ఈ ఒప్పందం అఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొనేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నామని వివరించారు.
అమెరికా, తాలిబన్ ఒప్పందంపై సౌదీ అరేబియా స్పందించింది. అఫ్ఘనిస్తాన్‌లో శాంతి సామరస్యానికి ఈ ఒప్పందం పునాదులు వేస్తుందని ఆశిస్తున్నట్టు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి తెలిపారు. అఫ్ఘాన్‌లో శాశ్వత శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్టు వివరించారు.
తాలిబన్‌లు ఈ అవకాశాన్ని అఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఉపయోగించుకోవాలని నాటో పిలుపునిచ్చింది. ఈ ఒప్పందంతో హింస తగ్గుతుందని భావించింది. ఆ దేశ ప్రభుత్వంతో తాలిబన్‌లు చర్చలు జరిపి.. శాశ్వత శాంతికి సుగమమయ్యే నిర్ణయాలు తీసుకుంటారని ఆశించింది.
పాకిస్తాన్ ప్రధాని ఈ దోహా శాంతి ఒప్పందాన్ని స్వాగతించారు. దీన్ని రక్తపాతం నుంచి శాంతి వైపునకు కుదిరిన సయోధ్యగా వర్ణించారు. ఒప్పంద వ్యతిరేకించే శక్తులను దరిచేరనివ్వొద్దని సూచించారు. నాలుగు దశాబ్దాలుగా తుపాకీ నీడలో బిక్కుబిక్కుమంటున్న అఫ్ఘాన్ ప్రజలు శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ ఒప్పందం అమలయ్యేందుకు, ప్రజలకు శాంతి చేకూరేందుకు కావాల్సిన సహకారాన్ని పాకిస్తాన్ అందిస్తుందని హామీనిచ్చారు.
కాగా, ఒప్పందం అనంతరం తాలిబన్, అమెరికాలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి. ఒప్పందాన్ని అమలు చేసేందుకు సంస్థ కట్టుబడి ఉన్నదని తాలిబన్ లీడర్ ముల్లా బరదర్ పేర్కొన్నారు. అఫ్ఘాన్ శాంతికోసం అందరు సహకరించాలని కోరారు. విదేశీ బలగాలు వెనక్కి వెళ్లి.. ఇస్లామిక్ చట్టాల కింద అఫ్ఘాన్ ప్రజలు శాంతియుతంగా జీవనం సాగిస్తారని ఆశిస్తున్నట్టు వివరించడం గమనార్హం. మళ్లీ అఫ్ఘాన్‌లో విదేశాలు జోక్యం చేసుకోవనే అనుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాశానికెత్తారు. త్వరలో తాలిబన్ లీడర్‌లను నేరుగా కలుస్తారని చెప్పారు. తమ ప్రజలను(బలగాలను) స్వదేశానికి స్వాగతించాలని ఆరాటపడుతున్నారని తెలిపారు. ఒకవేళ ఒప్పందాన్ని పాటించకుండా పరిస్థితులు మరింత దిగజారితే మాత్రం ఎన్నడూ ఎరగనంత కఠినమైన నిర్ణయాలతో ముందుకెళతామని హెచ్చరించారు.
అఫ్ఘనిస్తాన్‌లో యుద్ధాని(2001 నుంచి 2019వరకు)కి అమెరికా దాదాపు 975 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టింది. 2,441 మంది సైనికులను కోల్పోయింది. 2001లో అమెరికా, నాటో బలగాల ప్రవేశానికి పూర్వం కంటే.. నేడు అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రాబల్యం మరింత పెరిగడం గమనార్హం. మిలిటరీ ఔట్‌పోస్టులపై గతంలో కంటే ఇప్పుడు తాలిబన్ తరుచూ విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలోనే అమెరికా, తాలిబన్‌లు శాంతి ఒప్పందంపై సంతకం పెట్టాయి.