అర్బన్ పార్క్.. అభివృద్ధికి క్రాక్…

by Sridhar Babu |
అర్బన్ పార్క్.. అభివృద్ధికి క్రాక్…
X

దిశ, వేములవాడ: దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అర్బన్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ హరిదాస్ నగర్ మధ్యలో గల అటవీ ప్రాంతంలో రూ.3 కోట్ల వ్యయంతో అర్బన్ పార్క్ పనులను గత ఏడాది జూన్ 26న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నిర్మాణం పనులకు భూమిపూజ చేశారు.

దాదాపు రెండు వందల ఎకరాల్లో ఈ అర్బన్ పార్క్ నిర్మాణాలు చేపడుతున్న అందులో యోగ కేంద్రం, నక్షత్రవనం, రాశివనం, హెర్బల్ గార్డెన్, అడ్వెంచర్ ట్రెక్కింగ్, పూల మొక్కలు, గార్డెన్, పిల్లలకు ఆట వస్తువులు, పర్యాటకులు అక్కడే వనభోజనాలు చేసేందుకు కూడా కేంద్రాలను సైతం నిర్మిస్తున్నారు. అదేవిధంగా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఉట చెరువులతో పాటు, చిన్నచిన్న చెరువులో బోటింగ్ సౌకర్యం, అర్బన్ పార్క్ అందాలను వీక్షించేందుకు టవర్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు.

పాత పనులకు పూతలు...

అర్బన్ పార్క్ లో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పనుల్లో అధికారులు పాత పనులకే పూతలు పూసి బిల్లులు నొక్కేస్తున్నారు. పార్కుకు కావాల్సిన పనులను చేపట్టడంతో పాటు ఇదే అదునుగా భావించిన అధికారులు అడవి ప్రాంతంలో ఉన్న పాత కుంటల కట్ట పై కొత్త మట్టి పోసినారు. అదేవిధంగా అడవిని పూర్తిగా ధ్వంసం చేసి దానిపైనే కొత్తగా మట్టిపోసి కుంటను తయారు చేశారు. అవసరం లేకుండా చెక్ డ్యాములు నిర్మించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఒకే కాలువ నీటికీ మూడు కుంటలను నిర్మించడంతో పాటు ఒక చెక్ డ్యాం నిర్మించారు. అవసరం లేని పనులను ముందే చేసి వాటి బిల్లులను కూడా చేశారు. కానీ అవసరం ఉన్న పనులను పార్కులో ఇంతవరకు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.

ప్రారంభానికి ముందే పగుళ్ళు…

అర్బన్ పార్క్ లో చేసిన పనుల్లో నాణ్యత లోపించడంతో వాటికి కాస్త పగుళ్లుగా ఏర్పడ్డాయి. పార్క్ లో చేసిన పనులు సగం కూడా కాకముందే చేసిన వాటిలో పగుళ్ళు ఏర్పడటంపై నాణ్యత లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పార్క్ లో నిర్మించిన యోగా కేంద్రంలో ఇప్పుడే ఫ్లోరింగ్, మెట్ల వద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ పనులను అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతోనే నాసిరకం పనులు చేపట్టారని వెంకటాపూర్, హరిదాస్ నగర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పనులపై దృష్టి సారించి అందులో జరుగుతున్న అవినీతిపై విచారణ చేసి పనులను వేగవంతం చేయాలని ఈ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed