వలస జీవులకు సాయమందేనా.?

by Shyam |
వలస జీవులకు సాయమందేనా.?
X

దిశ, న్యూస్ బ్యూరో: కోవిడ్ -19 కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం రేషన్ కార్డులపై అదనంగా బియ్యం, రూ.1,500 ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ సాయం హైదరాబాద్ నగరంలోని వలస జీవులకు వర్తిస్తుందా అనే ప్రశ్న ఎదురవుతోంది. నగరంలో అసంఘటిత రంగంలో పని చేసేందుకు వేరే ప్రాంతాల నుంచి ప్రజలు వలస వచ్చారు. వీరికి స్థిర నివాసం లేదనే కారణం చేత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. పైగా ఇప్పుడు కరోనా దెబ్బతో అసంఘటిత రంగం కుదేలైంది. దీంతో వీరి పరిస్థితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం వీరినీ పరిగణనలోకి తీసుకుని సాయం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

రోడ్లనే ఆవాసంగా మార్చుకుని..

సిటీ జనాభాలో మెజార్టీ వలస వచ్చినవారే. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వారంతా సిటీలో ఇప్పుడు ఉండలేక, వెళ్లలేక కష్టాలు పడుతున్నారు. జనజీవనం స్తంభించడంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మేరకు చర్యలు చేపట్టడంతో కొంత ఉపశమనం లభిస్తోంది. అయితే, కంపెనీల్లో, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు, దినసరి, అడ్డా కూలీలకు కనీసం ఆకలి తీర్చుకునే మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన కంపెనీలు మినహా మిగిలిన వాటిల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను యాజమన్యాలు ఇప్పటికే బయటకు పంపించాయి. హమాలీ, ట్రాన్స్ పోర్ట్, భవన నిర్మాణ రంగం, ఇండ్లల్లో పనిచేసేవారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. వీరికి ఇక్కడ రేషన్ కార్డులు కాదు కదా.. కనీసం గుర్తింపు కార్డులూ లేవు. బోర్ వెల్స్, హమాలీ, కంపెనీ కార్మికుల్లో ఎక్కువగా బీహార్, కర్నాటక సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అధికం. సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక, తెలిసినవారు కనిపించక వీరిప్పుడు రోడ్లనే ఆవాసంగా మార్చుకుంటున్నారు. తినడానికి తిండిలేక ఆకలితోనే పడుకుంటున్నారు.

నిత్యావసర సరుకులు అందించాలి..

ఆటో నగర్ ఏరియాలో 6 వేలు, గడ్డి అన్నారంలో 3 వేల మందికి పైగా హమాలీ కార్మికులు ఉన్నట్టు అంచనా. భవన నిర్మాణ రంగంలో ఒక ఎల్బీనగర్ ప్రాంతంలోనే 7-8 వేల మంది వరకూ ఉంటారు. ప్లంబింగ్, ఎలక్ర్టీషియన్ తదితర పనుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఏ సహాయం కూడా వీరికి వర్తించలేదు. ఇండ్లలో పనిచేసే వారికీ కుటుంబ కష్టాలు తప్పడం లేదు. 3-4 ఇండ్లల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నవారికి ఇప్పుడు పని లేకుండా పోయింది. వీరందరినీ లెక్కలోకి తీసుకుంటే లక్షల్లో ఉంటారు. అయితే, వీరిని ప్రభుత్వం గుర్తించినట్టు కనబడటం లేదు. ప్రభుత్వం తక్షణమే వీరిని గుర్తించి కుటుంబాలకు అవసరమైన నిత్యవసర సరుకులతో పాటు రూ.10 వేలు అందివ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. అయితే, ఇందులో కొందరికి రేషన్ కార్డులు ఉన్నాయనీ, అవి వారి సొంతూళ్లో ఉన్నాయని కాబట్టి తమను సొంతూరుకు పంపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాలానగర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఆటోనగర్, ఐడీపీఎల్, చెంగిచర్ల, ఈసీయల్ ఏరియాల్లో లేబర్ పనులు చేసుకునే వలసదారులను ఆదుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.

Tags : corona effect, unorganised sector, collapse, labour, city, hyderabad,

Advertisement

Next Story

Most Viewed