- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగర రోడ్లపై 56 రోజుల తర్వాత సీన్ మారిపోయింది. పంజరంలో ఉన్న పక్షులను ఒక్కసారిగా వదిలేసినట్టు మంగళవారం పట్నమంతా వాహనాలు, జనాల రద్దీతో కళకళలాడింది. లాక్‌డౌన్ సడలింపుతో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వచ్చారు. కార్యాలయాలు, వ్యాపారులు, ఉద్యోగులతో పాటు ఉల్లాసానికి రోడ్లెక్కినవారు కూడా ఉన్నారు. నగరంలో బస్సులకు మినహా ప్రైవేటు క్యాబ్, ఆటోలు నడిచేందుకు అనుమతివ్వడంతో డ్రైవర్లు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జేబీఎస్ నుంచి మాత్రమే ప్రభుత్వం బస్సులకు పర్మిషన్ ఇచ్చినా బస్టాండ్ ఖాళీగానే కనిపించింది. నగరంలోనూ ఎక్కువ మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్‌లో ఉదయం ఆరు గంటల నుంచే లాక్‌డౌన్ సడలింపుల ప్రభావం కనిపించింది. పార్కులు, స్టేడియాలు తెరవకపోయినా నగర రోడ్లపై మార్నింగ్ వాకర్స్ కనిపించారు. రోడ్లపై వాహనాల రద్దీ కూడా పెరిగిపోయింది. లాక్‌డౌన్ ముందు రోజులతో పోలిస్తే 50 శాతం వరకూ వాహనాలు రోడ్లపై ఉరుకులు పెట్టాయి. జేబీఎస్, సంగీత్, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, బంజారాహిల్స్ ఏరియాల్లో సాధారణ స్థాయిలో వాహనాలు ప్రయాణించాయి. సిటీ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపించాయి. నగరంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్‌పోస్టులను ఎత్తివేసే పనుల్లో పోలీసు శాఖ బిజీగా మారిపోయింది. ఎక్కువగా ఉన్న బారీకేడ్లు, టెంట్లను రోడ్ల మీద నుంచి తొలగించి తరలించే పనిలో పోలీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. అయితే రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగిస్తున్న నేపథ్యంలో చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బందిని తగ్గించి పర్యవేక్షిస్తారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. లాక్‌డౌన్ మొదటి విడతతో పోలిస్తే ఇప్పటికే చాలా చెక్‌పోస్టుల్లో సిబ్బంది యాభై శాతం వరకూ తగ్గిపోయినట్టు కనిపిస్తోంది.
సందడి లేని జేబీఎస్
ఎంజీబీఎస్ నుంచి బస్సులను అనుమతించని ప్రభుత్వం జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి మాత్రం అనుమతించింది. బస్టాండ్‌లోనూ, బస్సుల్లోనూ జనాలు అంత ఎక్కువ సంఖ్యలో కనిపించలేదు. బస్టాండ్ ఆవరణలోని దుకాణాలను సైతం తెరవలేదు. జేబీఎస్ నుంచి సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్, మెదక్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్, యాదగిరిగుట్ట రూట్లలో లిమిటెడ్ సర్వీసులను ప్రారంభించినట్టు జేబీఎస్ అధికారులు చెబుతున్నారు. బస్సుల్లో శానిటైజర్లు, మాస్క్‌లు వినియోగించేలా డ్రైవర్లకు, కండక్టర్లకు సూచించారు. 50శాతం వరకూ ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అయితే ఒక్కో బస్సులో పది మందికి మించి ప్రయాణికులు కనిపించడం లేదు. కరీంనగర్ – జేబీఎస్ షెటిల్ సర్వీస్ నడుస్తున్న ఓ బస్సులో రెండు రూట్లలోనూ ఏడుగురు మాత్రమే ప్రయాణించారని బస్సు డ్రైవర్ తెలిపారు. జేబీఎస్ బస్టాండ్‌లో నీటి యంత్రం పనిచేయడం లేదు. బస్టాండ్ ఆవరణలో కుర్చీలు అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి. మెదక్, నారాయణఖేడ్ ప్రాంతాలకు చెందిన కూలీలు కొందరు సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చామని తెలిపారు. సాధారణ స్థాయిలో ప్రయాణాలు సాగేందుకు మరికొన్ని రోజులు పడుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రైవేటు, సొంత వాహనాలకు మినహాయింపు
నగరంలో ఆటోలు, ప్రైవేటు క్యాబ్‌లు రాకపోకలు నిర్వహిస్తున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత తమకు మినహాయింపునివ్వడంతో ప్రైవేటు ట్యాక్సీ డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఎంతో కొంత వస్తుందనే నమ్మకం వచ్చిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఆటోల అడ్డాలు పూర్వరూపంలోకి వస్తున్నాయి. నగరంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలకు ఆదాయం వస్తుండటంతో పరిస్థితి సర్దుకుంటుందని వారు భావిస్తున్నారు. జేబీఎస్ వద్ద ఆటోలతో ఉన్న కొందరికీ గిరాకీ రావడం లేదు. మొదటి రోజు కావడంతో ఆటోలు, క్యాబ్ డ్రైవర్లలో అందరికీ గిరాకీ దొరకలేదు. ఆఫీసులు, సంస్థల్లో పనిచేసే వారు వీటినే ఉపయోగించుకుంటున్నారు. కరోనా భయాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది సొంత వెహికిల్స్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. బైక్‌లు, కార్లు ఉన్నవారు తమ వాహనాలనే వినియోగించుకుంటున్నారు. కొలిగ్స్ కూడా తెలిసిన వారితోనే వెళ్లడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
నగరంలోని కంటైన్‌మెంట్ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతంలో సరి, బేసి విధానం పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాపార సంస్థలు, దుకాణాలు అనుసరించాల్సిన కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలపై జీహెచ్ఎంసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందుకోసం సరి, బేసి పద్ధతులు తెరిచి ఉంచేందుకు బల్దియా అధికారులు దుకాణాలకు నెంబర్లు కేటాయిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పర్యటించి భౌతిక దూరం, మాస్క్ ధరించడం తదితర నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.