కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి !

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కష్టాలతో కుదేలైన నేతన్నలకు రూ.93కోట్లు అందుబాటులోకి తెచ్చామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ విమర్శించింది. సోమవారం హైదరాబాద్‌లోని కమిటీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కష్టాలతో సతమతమవుతున్న నేతన్నలను ఆదుకోకుండా దీర్ఘకాలిక అవసరాలకు పొదుపు చేసుకున్న థ్రిఫ్టు ఫండ్ సొంత సొమ్మునే ప్రభుత్వం వాడుకొమ్మని ఆజ్ఞలు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బ్యాంకుల్లో రుణ సదుపాయాన్ని పెంచడం, కరోనా ప్రత్యేక భృతి, గ్రాంటులను ఏర్పాటు చేయడం, నిల్వ వస్త్రాలను కొనుగోలు చేయడంలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. లోపభూయిష్టంగా ఉన్న50శాతం యార్న్ సబ్సిడీ పథకాన్ని పక్కాగా అమలు చేయడం, పక్కరాష్ట్రాల మాదిరిగా ఏటా రూ.24వేల పెట్టుబడి సాయం అందించడం వంటి అంశాలు కరోనా సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు గురించి ఇంకెన్ని సార్లు సమీక్షిస్తారన్నారని ప్రశ్నించారు. మూడేళ్లు దాటినా టెక్స్ టైల్ పార్క్ పనులు ముందుకు సాగడం లేదన్నారు. గంపెడు ఆశలతో స్వగ్రామాలకు చేరుకున్న వలస నేత కార్మికులు జరుగుతున్న జాప్యాన్ని భరించలేక, మరో మార్గం కనపడక వలస ప్రాంతాలకు తిరిగి వెళ్లి భీవండి, షోలాపూర్, సూరత్‌లలో లాక్‌డౌన్‌లో 2లక్షల మంది చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 50శాతం నూలు సబ్సిడీ ఎందుకు పూర్తిగా అమలవ్వడం లేదో మంత్రి సమాధానమివ్వాలన్నారు. రెండుసార్లు బడ్జెట్లో పెట్టిన రూ.1273 కోట్లు, రూ.1260 కోట్లను ఏ విధంగా ఖర్చుపెట్టారో సమాధానం చెప్పాలన్నారు.

Advertisement

Next Story