గడీల పాలనను త్వరలోనే అంతం చేస్తాం: కిషన్ రెడ్డి

by Ramesh Goud |
గడీల పాలనను త్వరలోనే అంతం చేస్తాం: కిషన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: రాష్ట్రంలో కొన‌సాగుతున్న గ‌డీల పాల‌న త్వర‌లోనే అంతం కాబోతోంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేన‌ని ఉద్ఘాటించారు. ప్రజా ఆశీర్వాదయాత్రలో భాగంగా శుక్రవారం మ‌హబూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాల్లో కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి ప‌ర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న అనేక ర‌కాల ప‌థ‌కాల‌కు సంబంధించిన నిధుల‌ను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని ఆరోపించారు. ట్రాక్టర్ల పంపిణీలో టీఆర్ఎస్ కార్యక‌ర్తల‌ను మాత్రమే ఎంపిక చేయ‌డం ఇందుకు నిద‌ర్శన‌మని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయాల‌ను ప్రజ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆగ‌డాలు మ‌రెంతో కాలం న‌డ‌వ‌వ‌ని, ప్రజ‌లు త‌గిన స‌మ‌యంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నార‌ని హెచ్చరించారు.

భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు

పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి భద్రకాళీ ఆల‌యం, హన్మకొండ వేయి స్తంభాల గుడిలో పూజలు చేశారు. భద్రకాళి ఆలయం పర్యాటక కేంద్రంగా మారనుందని, ఇందులో భాగంగానే హృదయ్‌, స్మార్ట్‌సిటీ పథకం నిధులతో భద్రకాళి బండ్‌ అభివృద్ధి చెందిందన్నారు. అతి పురాత‌న‌, కాక‌తీయుల నాటి, ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆల‌యం వేయిస్తంభాల గుడి అని అన్నారు. భ‌ద్రకాళి దేవాల‌యానికి, వేయి స్తంభాల రుద్రేశ్వరాల‌యానికి ఎంతో అనుబంధం ఉందని, ఈ రెండు దేవాల‌యాలూ కాక‌తీయుల కాలంలో నిర్మిత‌మైన‌వేన‌ని అన్నారు. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, ఒద్దిరాజు రాంచందర్ రావు, కట్టా సుధాకర్ రెడ్డి, పెదగాని సోమయ్య, ఆర్. కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed