‘మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్’

by Shyam |
Kishan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: భైంసా అల్లర్లు పథకం ప్రకారమే జరుగుతున్నాయని, మజ్లిస్ అండతోనే ఆ పట్టణంలో హిందువులపై దాడులు పునరావృతం అవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో భైంసా అల్లర్లు, రాష్ట్ర సర్కార్‌ వైఫల్యాలపై మీడియాతో మాట్లాడారు. భైంసా అల్లర్లకు టీఆర్ఎస్ సర్కార్‌దే బాధ్యతని, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మజ్లిస్‌కు అండగా ఉంటూ.. పోలీసులను పని చేయకుండా చేస్తున్నారని విమర్శించారు. కలహాలకు కారణమైన మజ్లిస్ నేతలను వదిలేస్తున్నారని, అందువల్ల అల్లర్లు జరిగినప్పుడు హిందువులు మాత్రమే నష్టపోతున్నారన్నారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలున్నా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 6 నెలల్లో రెండు సార్లు అల్లర్లు జరిగాయని, అయినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదన్నారు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే బయటకు రాకుండా ప్రయత్నించారని, నిందితుడిపై కేసు నమోదు చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

పరిస్థితిని చూస్తే సీఎం కేసీఆర్ వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోనూ సిచ్యుయేషన్స్ పశ్చిమ బెంగాల్‌‌లో మాదిరిగానే ఉన్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ మోడీపై విమర్శలు చేయడం అలవాటుగా పెట్టుకున్నారన్నారు. అభివృద్ధి తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అన్న చందంగా టీఆర్ఎస్ పాలన ఉందన్నారు. రాష్ట్రంలో పరిపాలన తీరు చూస్తే ఆశ్చర్యమేస్తోందని, ముఖ్యమంత్రి కుమారుడే తెలంగాణను శాసిస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలపై ఆయన పెత్తనం చెలాయిస్తున్నాడని విమర్శించారు. భైంసాలో అల్లర్లు జరిగితే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. భైంసా ఘటనపై కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం కుదరదని, రాష్ట్రాన్ని నివేదిక కోరుతామన్నారు.

Advertisement

Next Story