అకాల వర్షం..రైతులకు అపార నష్టం

by Shyam |
అకాల వర్షం..రైతులకు అపార నష్టం
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని మంచాల, మాడ్గుల, అమన్‌గల్, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట, బంటారం మండలాల్లో మంగళవారం అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో రైతులు పండించిన పంట నేలపాలైంది. దీంతో వారికి అపార నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. రెండు గంటల పాటు భారీగా కురిసిన వర్షం వలన మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలు, పూల తోటలు, ఉల్లిగడ్డ, జొన్న పంటలకు భారీ నష్టం కలిగింది. వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉండటంతో అకాల వర్షం కారణంగా ధాన్యం మొత్తం నేల రాలింది. అలాగే జొన్న, aమొక్కజొన్న పంట కోతకు వచ్చాయని, ఈదురు గాలుల దెబ్బకు పంట నేలకు ఒరగగా, ఉల్లిగడ్డ పంట మురిగిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందు గానే కొందరు రైతులు పంట మొత్తం తీసి పొలంలో మండే వేసి అందులో ఉల్లిగడ్డలు పొగుచేశారు. ఈదురు గాలుల కారణంగా మండే పై కప్పు ఎగిరి పోవడంతో చేతికొచ్చిన ఉల్లిగడ్డ పంట తడిసి ముద్దయింది.బంటారం, మర్పల్లి, మోమిన్పేట మండలాలలో అత్యధికంగా కూరగాయల సాగు ఉంటుంది. వందలాది ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేస్తుంటారు. అకాల వర్షం కారణంగా మిర్చి, బీర, బెండకాయ, వంకాయ చిక్కుడు, ఆకుకూరలు, కొత్తమీర, పుదీనా, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.వాటితో పాటే చేమంతి, కనకంబరం, గులాబీ తోటలు పాడయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూసిన పువ్వులన్నీ రాలిపోవడంతో రూ.లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ఉగాది తర్వాత మామిడి తోటల్లో ఇప్పుడిప్పుడే కాయలు ఎదుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే వడగండ్ల వాన రావడంతో పిందెలతో పాటు ఎదిగిన కాయలు రాలిపోగా, మామిడి కొమ్మలు విరిగిపోయాయని రైతులు వెల్లడించారు. అకాల వర్షం వలన రైతులు నష్టపోయిన పంటల విలువను అంచనా వేసి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags: rain, crop damage, farmers get lost, rangareddy

Advertisement

Next Story

Most Viewed