మాకు నజరానా ఇంకా అందలేదు

by Anukaran |
మాకు నజరానా ఇంకా అందలేదు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : గ్రామాల్లో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేస్తే ఆ పంచాయతీకి ప్రోత్సాహకం అందజేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయా గ్రామాల రాజకీయ నాయకులు సైతం కలిసికట్టుగా గ్రామాలను అభివృ‌ద్ధి చేసుకోవాలనే ఆలోచనతో పోటీ నుంచి తప్పుకుని పలు పంచాయతీలను ఏకగ్రీవం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 294 గ్రామ పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో కొన్నింటిని ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు ఏకగ్రీవం చేసినా, మరి కొన్నింటిని మాత్రం గ్రామస్తులు కలిసి ఏకగ్రీవం చేశారు.

ఇలా ఏకగ్రీవం అయ్యే గ్రామ పంచాయితీలకు గతంలో ప్రభుత్వం రూ.7లక్షలను ప్రోత్సహకంగా గ్రామ అభివృద్ధికి నిధులు ఇచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రం జిల్లాల విభజన చేసిన తరువాత నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నజరానాను రూ.12లక్షలకు పెంచింది. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 294 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో వీటికి రావాల్సిన రూ.35.28కోట్ల నిధులు నేటికి విడుదల కాలేదు. ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర కావస్తున్న ఇంతవరకు ప్రభుత్వం వీటిని ఆయా గ్రామపంచాయతీలకు అందించలేదు. ప్రస్తుతం గ్రామానికి ప్రభుత్వం నుంచి నెల వారిగా వచ్చే సాధారణ నిధులతోనే ఆయా గ్రామ పంచాయితీలు కాలం వెలదీస్తున్నాయి. ఈ నిధులు వస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశముందని సర్పంచ్‌లు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed