కరోనాకు గొడుగుతో చెక్ పెట్టవచ్చు: డాక్టర్ కూటికుప్పల

by srinivas |
కరోనాకు గొడుగుతో చెక్ పెట్టవచ్చు: డాక్టర్ కూటికుప్పల
X

కరోనా మహమ్మారికి గొడుగుతో చెక్ పెట్టవచ్చని వైజాగ్ కంచరపాలెంకి చెందిన వైద్యుడు కూటికుప్పల సూర్యారావు అభిప్రాయపడ్డారు. దానిని సోదాహరణంగా వివరిస్తూ.. ఒకప్పుడు పెద్దలు బయటకు వెళితే ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో గుడ్డ సంచి తప్పనిసరిగా పట్టుకు వెళ్లేవారని గుర్తు చేశారు. ఎండ, వానల నుంచి రక్షణగా ఉంటుందని గొడుగు, దారిలో ఏదైనా కొంటే తెచ్చుకునేందుకు వీలుగా గుడ్డ సంచి పట్టుకు వెళ్లేవారని అన్నారు. ప్రస్తుతం ఈ రెండింటిని ఎవరూ వినియోగించడం లేదని ఆయన చెప్పారు. వారి మాటలే ఇప్పుడు మనకు రక్షణగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరంపై ప్రతి ఒక్కరూ హెచ్చరికలు చేస్తున్నారని అన్నారు. ఈ సామాజిక దూరం పాటించడం చాలా కాలం క్రితమే మనం వదిలేశామని చెబుతూ, గొడుగు వినియోగించడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సామాజిక దూరం సిద్ధాంతాన్ని సులువుగా అమలు చేయవచ్చన్నారు. గొడుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు తమకు తెలియకుండానే కనీసం మీటరు దూరం పాటిస్తారని ఆయన తెలిపారు.

గొడుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఎదురు పడితే బాగా దగ్గరగా రావాలంటే వారి కమాన్ (గొడుగులో ఉండే ఇనుప ఛట్రం) లు అడ్డుకుంటాయని, దాంతో వారు కనీసం మూడు అడుగులు లేదా మీటర్ దూరంలోనే ఉండిపోతారని ఆయన చెప్పారు. దీంతో ఎదుటివారు తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపర్లను కూడా ఈ గొడుగు అడ్డుకుంటుందని అన్నారు. బయట నుంచి రాగానే ఆ గొడుగును ఓ గంటపాటు ఎండలో ఉంచితో అప్పటికే దానిపై ఏమైనా వైరస్ చేరి ఉంటే చనిపోతుందని, తరువాత దానిని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. బయటకి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే గొడుగు తప్పని సరిగా వినియోగించాలని ఆయన సూచించారు.

Tags: kuti kuppala surya rao, doctor advice, visakhapatnam, corona, umbrella

Advertisement

Next Story

Most Viewed