ఉద్యోగ పర్వం:జీతాలు చెల్లించండి మహాప్రభో!

by Ravi |   ( Updated:2022-09-03 14:50:51.0  )
ఉద్యోగ పర్వం:జీతాలు చెల్లించండి మహాప్రభో!
X

తెలంగాణ ధనిక రాష్ట్రం. 2014లో 16 వేల కోట్ల రూపాయలకు పైగా మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ఎప్పుడు చెల్లిస్తారో ఎవరికీ తెలియదు. జులై 12 నాటికి 19 జిల్లాలలో ఉద్యోగులకు జూన్ నెల జీతాలు చెల్లించనే లేదు. రోజుకు కొన్ని జిల్లాల చొప్పున విడతలవారీగా చెల్లిస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గత కొన్నేండ్లుగా ఇదే తంతు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు ఠంచనుగా జీతాలు చెల్లించారు. స్వరాష్ట్రంలో ఒకటో తేదీ కాదుకదా, కనీసం ఒకటో వారంలో జీతాలు వస్తే హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉద్యోగులకు దాపురించింది.

ఎప్పుడో ఒకసారి జీతాలు లేట్ అయితే, ఏదో విధంగా సర్దుబాటు చేసుకునేవారు. ప్రతి నెలా ఆలస్యమే. ఉమ్మడి రాష్ట్రంలో నెలాఖరున దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలు వస్తే వారం రోజుల ముందే వేతనాలు చెల్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వరాష్ట్రంలో పండుగలకు ముందు కాదు కదా, ఒకటో తేదీన కూడా ఇవ్వకపోవడం శోచనీయం. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల చెల్లింపులను అప్పటి ప్రభుత్వాధినేతలు ప్రతిష్టగా తీసుకునేవారు. ఎన్ని ఇబ్బందులున్నా సక్రమంగా జీతాలు ఇచ్చేవారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఉద్యోగులకు ఎన్నడూ జీతాలు ఆలస్యం కాలేదు. కానీ , రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

ఎందుకీ దుస్థితి!?

2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 2,45,257 కోట్లు. రాష్ట్ర ఓన్ రెవెన్యూ రూ 1,33,634 కోట్లు. వీటిలో పన్నుల ద్వారా రాష్ట్ర సొంత రాబడి రూ.1.08,212 కోట్లు. కాగా, నాన్-టాక్స్ ఓన్ రెవెన్యూ రూ.25,422 కోట్లు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల వార్షిక వ్యయం రూ.25 వేల కోట్లు కాగా, పెన్షన్ ఖర్చు రూ.11 వేల కోట్లు. రాష్ట్రానికి సొంత ఆదాయం భారీగా ఉన్నా జీతాలు, పెన్షన్ కోసం నెలకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఎందుకు సమస్యగా మారిందో ఎవరికీ తెలియదు. ఆర్థిక సంవత్సరం చివరలో ఫిబ్రవరి, మార్చి మాసాలలో నిధులకు కటకట ఉండి, జీతాలు ఆలస్యం అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ప్రతి నెలా లేటయితే ఏమనుకోవాలి? జీతాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు.

సందర్భం వచ్చిన ప్రతిసారీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు, తలసరి ఆదాయం సాధిస్తున్నది తెలంగాణ మాత్రమేనని మంత్రులు చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంలో చేతులెత్తేశారు. కరువు భత్యం (డీఏ) వాయిదాలను సైతం పెండింగులో పెట్టారు. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మూడు డీఏ వాయిదాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దాదాపు 10.01 శాతం డీఏ పెరగాల్సి ఉంది. డీఏల సంగతి దేవుడెరుగు? సకాలంలో జీతాలు చెల్లిస్తే చాలు అనుకునే పరిస్థితికి ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీసుకొస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

సప్లిమెంటరీ బిల్లులతో సమస్యలు!

వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా లీవ్ పెట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు రావడం దైవాధీనంగా మారిపోయింది. సప్లిమెంటరీ బిల్లులను పాస్ చేయకుండా, ఈ-కుబేర్‌లో నెలల తరబడి పెండింగులో పెడుతుండటంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. సర్టిఫికెట్స్, లీవ్ ఫామ్ జత చేసి సెలవు మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినా మెజారిటీ అధికారులు అడ్వాన్సుగా లీవ్ మంజూరు చేయడానికి ససేమిరా అంటున్నారు. వాస్తవానికి డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి, లీవ్ మంజూరుకు అభ్యర్థిస్తే అధికారులు వెంటనే లీవ్ మంజూరు చేయాలి. కానీ, అవగాహనాలోపంతో విధులలో చేరిన తర్వాతే మంజూరు చేస్తున్నారు. వేతనంలో కోత విధిస్తున్నారు.ఈ నెల విషయమే తీసుకుంటే, భారీ వర్షాలు, వరదల కారణంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధవారాలు) సెలవు ప్రకటించింది. ఈ నెల ఎనిమిది వరకు సెలవుపై ఉండి సోమవారం విధులలో చేరాలనుకున్న టీచర్లకు దీంతో 13 వరకు విధులలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. వారు 14న మాత్రమే చేరాల్సి ఉంటుంది. లీవ్ పీరియడ్ పది రోజులు దాటితే ఆకస్మిక సెలవు మంజూరు చేయడానికి వీలు ఉండదు.

ఇలాంటి సందర్భాలలో లీవ్ పీరియడ్‌కి ముందు జనరల్ హాలిడేస్ ఉన్నపుడు వాటిని ప్రిఫిక్స్‌కి, 9 నుంచి 13 వరకు సఫిక్స్‌కి విధిగా అనుమతించాలి. ఈ మూడు రోజుల సెలవులను ప్రభుత్వం లోకల్ హాలిడేస్‌గా పేర్కోలేదు. జూలై ఎనిమిది వరకు మాత్రమే ఆకస్మికేతర సెలవు (ఓసీఎల్) మంజూరు చేయాలి. వేతనంలో కోత విధించకూడదు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. కోత పడిన వేతనాన్ని మరుసటి నెలలో సప్లిమెంటరీ బిల్లు ద్వారా తిరిగి క్లెయిమ్ చేస్తున్నారు. సప్లిమెంటరీ బిల్లుల్లను పాస్ చేయకుండా ఈ-కుబేర్ లో అధికారులు నెలల తరబడి పెండింగులో పెడుతుండటంతో లీవ్ పీరియడ్ శాలరీ ఎన్ని నెలలకు చేతికి వస్తుందో ఎవరికీ తెలియడం లేదు.

బిల్లులన్నీ పెండింగ్! పెండింగ్!

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వివిధ రకాల బిల్లులన్నీ పెండింగులో పెడుతున్నారు. సరెండర్ లీవ్, జీపీఎఫ్ అడ్వాన్సులు, పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్, మెడికల్ రీయింబర్సుమెంట్, ఎఫ్ఏసీ అలవెన్సు, పిల్లల ఫీజు రాయితీ తదితర బిల్లులు నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. చివరికి రిటైరయ్యే రోజే రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లిస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చిన పెన్షన్ కమ్యుటేషన్ బిల్లులు సైతం నెలలు దాటినా శాంక్షన్ కావడం లేదు. ఈ-కుబేర్‌లో పెండింగులో పెడుతున్నారు.

సత్వర చెల్లింపులు, పారదర్శకత కోసం అంటూ తీసుకొచ్చిన ఈ-కుబేర్ సిస్టం నిర్దేశిత లక్ష్యం కోసం వాడుతున్నారా? లేక సెంట్రలైజ్‌డ్ పేమెంట్ విధానంతో ఏ బిల్లునైనా పెండింగులో పెట్టడానికి వినియోగిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. బ్యాంకు అకౌంటులో డబ్బు క్రెడిట్ అయిందో లేదో రోజూ వెరిఫై చేసుకోవడమే తప్ప, పెండింగ్ లో పెట్టిన బిల్లులు ఎప్పుడు మంజూరు అవుతాయో చెప్పే నాథుడు కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు చూడని పరిస్థితులు స్వరాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కోవడం విషాదమనే చెప్పాలి. కొట్లాడి సాధించున్న రాష్ట్రంలో ఉద్యోగుల బాధలు పట్టించుకునేవారే లేరు.

సీఎం చొరవ చూపాలి !

గత రెండేండ్లుగా ప్రతి నెల జీతాలు చెల్లించడంలో ఆలస్యమైనా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆవేదన కలిగిస్తోంది. ఉద్యమాలు చేయడం సంగతి అటుంచి, కనీసం సీఎం కేసీఆర్ ను కలిసి సమస్యను వివరించి పరిష్కరించే కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి. రాష్ట్ర సాధనలో తనతో కలిసి పని చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను దూరం పెట్టడం తగదు. సంఘాల ప్రతినిధులను పిలిపించుకొని చర్చించాలి. సమస్యలను పరిష్కరించాలి. ప్రతి నెల జీతాల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూసే దుస్థితిని వెంటనే తొలగించాలి. పెండింగులో ఉన్న మూడు డీఏ వాయిదాలను కూడా రిలీజ్ చేయాలి. తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారని తరచుగా చెప్పే మాటలను ఆచరణలో చూపించాల్సి ఉంది.

మానేటి ప్రతాపరెడ్డి

టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు

98484 81028

Advertisement

Next Story

Most Viewed