బీజేపీపై ఉద్ధవ్ నిప్పులు..మతం పేరిట అధికారమా?

by Ramesh Goud |   ( Updated:2020-02-05 02:18:27.0  )
బీజేపీపై ఉద్ధవ్ నిప్పులు..మతం పేరిట అధికారమా?
X

బీజేపీపై శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన, బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి సవాలు విసురుతున్నాయి. హిందూత్వ ఎజెండాతో పురుడుపోసుకున్న శివసేన సారూప్య పార్టీ బీజేపీ మిత్రపక్షంగా సుదీర్ఘ కాలం కొనసాగింది. తాజాగా బీజేపీ నేతలు శివసేన ఇంకా మిత్రపక్షమే అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

బీజేపీ భావజాలంతో తమకు ఏ రకమైన సారూప్యమూ లేదని ఉద్ధవ్ తేల్చి చెప్పారు. ఎన్నార్సీని మహారాష్ట్రలో అమలు చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతియుతంగా లేనటువంటి హిందూ దేశం తనకు అక్కర్లేదని ఆయన బీజేపీని విమర్శించారు. మతం పేరుచెప్పి అధికారం పొందండం తన హిందూత్వ విధానం కాదని ఆయన బీజేపీని ఎద్దేవా చేశారు. ఒకర్ని ఒకరు చంపుకోవడం లేదా దేశంలో కల్లోలం సృష్టించడం హిందూత్వ విధానం కానేకాదని ఆయన స్పష్టం చేశారు.

సీఏఏకు మద్దతిచ్చిన ఆయన ఎన్నార్సీకి వ్యతిరేకమని తెలిపారు. సీఏఏ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చే మైనార్టీల కోసమే ఆ చట్టమని ఆయన తెలిపారు. ఎన్నార్సీ అలా కాదని, పౌరసత్వాన్ని నిరూపించుకోమనడమని.. పౌరసత్వం నిరూపించుకొమ్మంటే హిందువులైనా, ముస్లింలైనా ఇతరులెవరికైనా కష్టమేనని ఆయన చెప్పారు. సీఏఏ దేశపౌరుల పౌరసత్వాన్ని వారి నుంచి దూరం చేయదని ఆయన తెలిపారు. అందుకే శివసేన సీఏఏకి మద్దతిచ్చి, ఎన్నార్సీని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story