ఇద్దరు గృహిణులను బలిగొన్న ‘భయం’

by Aamani |   ( Updated:2021-05-13 10:42:43.0  )
ఇద్దరు గృహిణులను బలిగొన్న ‘భయం’
X

దిశ, బెల్లంపల్లి : తమకు ఎక్కడ కరోనా సోకిందేమోననే భయం ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా బలి తీసుకుంటోంది. తాజాగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు గృహిణిలు కరోనా వ్యాధి లేనప్పటికీ కేవలం భయం వల్లే శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి మృతి చెందారు. గురువారం పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన వనారెడ్డి భార్య స్వరూప రెడ్డి వారం రోజుల కిందట రెండో డోసు వ్యాక్సిన్ పట్టణంలోనే తీసుకుంది. అనంతరం ఆమెకు తీవ్రమైన జ్వరంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి నాలుగు రోజులుగా అనారోగ్యంతో మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి సుమారు రూ.10 లక్షలు వెచ్చించారు. చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని భర్త వనారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాధి నిర్ధారణకు పరీక్షలు నిర్వహించినప్పటికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా మృతి చెందడం పట్ల రోదిస్తున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

బెల్లంపల్లి బస్తీకి చెందిన సింగరేణి డిస్మిస్ కార్మికుడు పట్నం పితాంబరం భార్య లతకు తీవ్రమైన జ్వరం వచ్చింది. గురువారం హుటాహుటిన ఆమెను మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో మృతి చెందింది. వైద్య చికిత్సల కోసం రూ.లక్షలు అప్పులు చేసి కుటుంబీకులు ప్రాణాలను కాపాడుకునేందుకు చేసినా ప్రయత్నాలు విఫలమై గాల్లో ప్రాణాలు కలిసిపోవడం నిత్యకృత్యంగా మారింది. మృతదేహాలను కరోనా నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story