ఘోర రోడ్డు ప్రమాదం.. బావ, బావమరిది మృతి

by Sumithra |
Vageedu-Road-Accident
X

దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం చిన్న గొల్లగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త ఇంటి నిర్మాణం కోసం ఇటుకలు తేవడానికి వెళ్లిన బావ, బావమరిది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల ప్రకారం.. చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన డర్రా నరసింహారావు(35), ఎర్ర లాలయ్య(38) కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి ఇటుకల కోసం డీసీఎంలో బయలుదేరారు.

ఈ క్రమంలో మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో ఆగి ఉన్న ఇసుక టిప్పర్‌ను ఇటుకలు తీసుకువస్తున్న డీసీఎం ఢీకొట్టింది. టిప్పర్‌ను డీసీఎం వేగంగా ఢీకొట్టడంతో డ్రైవర్ మురళీ కృష్ణ సహా, వారిద్దరూ డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్నారు. అనంతరం గ్రామస్తులు, పోలీసుల సాయంతో మూడు గంటల పాటు ప్రయత్నించగా వారిని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. పోలీసులు గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో చికిత్స పొందుతూ నరసింహరావు, లాలయ్య మృతి చెందగా, డ్రైవర్ మురళీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story