‘బిర్యానీ’ తెచ్చిన తంటా.. ఇద్దరు కానిస్టేబుళ్లు బలి

by Sumithra |
biryani case
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో బిర్యానీ తినడం సంచలనం రేపింది. ఈ విషయం బయటకు రావడంతో ఇద్ధరు పోలీసుల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టికీ చెందిన గ్రామ అధ్యక్షుడు కావడం, అతడిని విచారణ నిమిత్తం కేసుకు సంబంధం లేని పీఎస్‌లో ఉంచిన సమయంలో అతడు బిర్యానీ తింటున్న పోలీస్‌స్టేషన్ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ టైంలో విధుల్లో ఉన్న ఇద్ధరు కానిస్టేబుల్స్ పై వేటు పడింది. ఈ కేసుకు తమది కాదని, నిందితుడు తమ పరిధిలో లేడని, విచారణ నిమిత్తం తీసుకువచ్చిన వ్యక్తి చికెన్ బిర్యానీ తింటే తమ ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని తెలీక ఇద్దరు పోలీసులు విధుల నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కేవలం ఆ సమయంలో విధుల్లో ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పీఎస్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సాయన్న, మరో కానిస్టేబుల్ రాజేశ్వర్‌లను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల చివరి వారంలో ఆర్మూర్ పీఎస్ సెక్షన్ ఐపీగా జమేదార్ సాయన్న, వాచ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రాజశేఖర్‌ల నిర్లక్ష్యం కారణంగానే సిద్దార్థ అనే యువకుడి హత్యకేసులో ప్రధాన సూత్రదారి కనకం రమేష్ బిర్యానీ తింటూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడిన వ్యవహరం బయటకు రావడంతో వీరిని బాధ్యులను చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతేకాకుండా ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులకు మెమోలు ఇచ్చి సంజాయిషీ కోరినట్లు మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. పీఎస్‌లో ఎస్‌హెచ్‌ఓల అదేశాలు లేకుండా నేరస్థులకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి సేవలు అందవు. అంతా స్టేషన్ అధికారుల ఆదేశాల మేరకు జరిగినా వారిని వదిలేసి కింది స్థాయి సిబ్బందిని బలిచేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

కేసు పూర్వాపరాలు :

మే 19న కమ్మర్ పల్లి మండలం హసకోత్తుర్‌కు చెందిన మాలవత్ సిద్ధార్థ అనే యువకుడిని గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కనుక రాజేష్‌తో పాటు మరో నలుగురు కలిసి కొట్టి చంపారు. సిద్ధార్థ తన సోదరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని గతంలో పలుమార్లు హెచ్చరించి వదిలివేసినా అతను పట్టించుకోకపోవడంతో రాత్రివేళ ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి హతమార్చారు. చివరకు సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని కట్టుకథ అల్లి రాత్రికి రాత్రే ఖననం చేసేందుకు యత్నించగా, కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో హత్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. బీజేపీ యువ మోర్చాలో ఉన్న సిద్ధార్థను టీఆర్ఎస్‌కు చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు హత్య చేయడంతో రాజకీయంగా పెద్ధ దూమారం రేపింది. అధికార పార్టీ నేతలు, ఇతరులు హంతకులకు కొమ్ము కాస్తున్నారని కుటుంబ సభ్యులు ఆ రోజు శవాన్ని తరలించకుండా అడ్డుకుని ఆందోళన చేశారు.

దీంతో పోలీసులు ప్రధాన సూత్ర ధారిగా అరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్‌ను అదుపులోకి తీసుకుని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఉంచితే శాంతి భద్రతల సమస్య వస్తుందని భావించి ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో తన ఇద్దరు అనుచరులతో మే 22న పీఎస్‌లో బిర్యాని తింటున్న వీడియో కాల్, వాయిస్ కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసి బీజేపీ లీడర్లతో పాటు కుటుంబ సభ్యులు సైతం మాలవత్ సిద్ధార్థ హత్య కేసు విచారణలో పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ కేసులో పెద్ధ ఎత్తున డబ్బులు చేతులు మారాయని, అందుకే కేసును నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రే నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఆర్మూర్ డీఎస్పీ విలేఖరులకు సమాచారమిచ్చారు. కానీ, రాజేష్ పీఎస్‌లో బిర్యాని తింటూ సెల్‌ఫోన్ మాట్లాడిన వ్యవహరం మీడియా, సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టెబుల్‌పై సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చి కేసును తప్పుదొవ పట్టిస్తున్నట్లు బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed