భావోద్వేగపూరితం.. ఆ ఆరు నిమిషాల ప్రేమ

by Anukaran |   ( Updated:2020-12-31 04:35:36.0  )
భావోద్వేగపూరితం.. ఆ ఆరు నిమిషాల ప్రేమ
X

దిశ, వెబ్‌డెస్క్ : 2020లో ప్రపంచాన్ని కరోనా ఎంతగా భయాందోళనకు గురిచేసిందో వేరే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండియాలో లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేసినా.. బ్రిటన్, అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రం ఇప్పటికీ లాక్‌డౌన్, కొవిడ్ రూల్స్ అమలవుతూనే ఉన్నాయి. దాంతో మార్చి నుంచి ఇప్పటివరకు ఎవరినీ కలవలేని, ఎవరితోనూ కాసేపు స్పెండ్ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక 70 ఏళ్ల పైబడి ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు.. తమను పలకరించేవారే లేక మరింత కుంగుబాటుకు గురవుతున్నారు. తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడినా.. దగ్గరుండి గడిపిన ఫీలింగ్ అయితే రాదు. దాంతో బ్రిటన్‌, బ్రామ్లే సిటీకి చెందిన 70 ఏళ్లు పైబడిన వృద్ధ దంపతులు క్లైవ్, బార్బరా.. ధ్రువపు ఎలుగుబంట్ల ఔట్‌ఫిట్ ధరించి వెళ్లి తమ మనుమలు, మనుమరాలిని సర్‌ప్రైజ్ చేయగా, వారి ప్రేమ నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది.

ఒకరి మీద అమితమైన ప్రేమ ఉందంటే, వారికోసం ఏం చేసేందుకైనా వెనుకాడం. కానీ కొవిడ్ భయాలు, లాక్‌డౌన్‌ ఆంక్షలు.. ప్రియమైన వారిని కూడా దూరం చేయగా, వాటిని సైతం లెక్కచేయకుండా తమ వారిని కలుసుకునేందుకు తెగువచూపిన ఎన్నో కథలను 2020లో చూశాం. ఇది కూడా అలాంటి ఓ భావోద్వేగమైన ఘటనే. యూకేకు చెందిన క్లైవ్, బార్బరాలకు తమ కొడుకు పిల్లలైన క్విన్(6), మోర్గాన్ (8), మ్యాకెంజి(14) అంటే ఎంతో ఇష్టం. సెలవులు వచ్చినప్పుడల్లా వారిని కలుస్తుండే ఆ పెద్దలకు.. లాక్‌డౌన్ శాపంలా మారింది. మార్చి నుంచి ఆ పిల్లలను చూడలేకపోవడం, వారితో దగ్గరగా కాసేపైనా టైమ్ స్పెండ్ చేయలేకపోవడంతో వేదనకు గురయ్యారు.

ఈ క్రమంలో ఎలాగైనా తమ మనుమలు, మనవరాలిని కలుసుకోవాలనుకున్న ఈ ఓల్డ్ కపుల్.. అందుకోసం పోలార్ బీర్ దుస్తులు ధరించి, వెస్ట్ యార్క్‌షైర్‌లోని లీడ్స్ సిటీకి బయలు దేరారు. క్లైవ్, బార్బరా వస్తున్నట్లు తమ కుమారునికి మాత్రమే తెలియగా, పోలార్ బీర్ ఔట్‌ఫిట్స్‌తో వచ్చిన తమ గ్రాండ్ పేరెంట్స్‌ను చూసిన ఆ చిన్నారులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిన్నారులను తనివితీరా హత్తుకున్న ఆ వృద్ధ జంట.. కొవిడ్ కొత్త స్ట్రెయిన్ భయాందోళనల కారణంగా ఆరు నిమిషాల్లోనే తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయారు. కాగా తమ జీవితంలో ఈ ఆరు నిమిషాలు ఎంతో ప్రేమాన్వితమైనవని, 2020లో వీటిని మించిన అద్భుత క్షణాలు తమకు లేవని క్లైవ్, బార్బరా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఆ వృద్ధ దంపతులు.. తమ వల్ల తమ గ్రాండ్ చిల్డ్రన్స్‌కు ఎలాంటి ముప్పు రాకూడదని, కొవిడ్ వైరస్ సోకకూడదనే అంత జాగ్రత్త పడగా, వారి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ మన దగ్గర మాత్రం మాస్క్ ధరించడంలోనూ అశ్రద్ధ చూపడంతో పాటు పెట్టుకున్నవారు కూడా వాటిని సరిగ్గా ధరించకపోవడం గమనార్హం. ఇక గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్లను హగ్ చేసుకోవడం కోసం ఇటీవలే ‘హగ్ కెర్టెన్లు’ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story