TTD : అగరబత్తీల కేంద్రం ప్రారంభం.. ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లు

by srinivas |   ( Updated:2021-09-13 04:16:47.0  )
TTD : అగరబత్తీల కేంద్రం ప్రారంభం.. ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం అగరబత్తీల కేంద్రాన్ని ప్రారంభించింది. గోశాలలో టీటీడీ అగరబత్తులు విక్రయ, ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్ రెడ్డిలు ప్రారంభించారు. సోమవారం నుంచి భక్తులకు టీటీడీ అగరబత్తీలు అందుబాటులోకి రానున్నాయి. అతి తక్కువ ధరలకే అగరబత్తీలను విక్రయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను తయారు చేస్తోంది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తీలను టీటీడీ విడుదల చేసింది.

లాభాపేక్ష లేకుండా అగరబత్తీల విక్రయం-చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఆలయాల్లో వాడిన పూలతో అగరబత్తీలు తయారీని ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి లాభాపేక్షలేకుండా దర్శన్ సంస్థ అగరబత్తీలను తయారు చేస్తోందని వెల్లడించారు. తిరుపతి, తిరుమలలో భక్తులకు అగరబత్తీలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా వీటిని తయారు చేసినట్లు తెలిపారు. అలాగే స్వామివారికి వినియోగించిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించామన్నారు. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story