స్వామి వారి అఖండ దీపం కొండెక్కలేదు: వైవీ సుబ్బారెడ్డి

by srinivas |
స్వామి వారి అఖండ దీపం కొండెక్కలేదు: వైవీ సుబ్బారెడ్డి
X

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలోని అఖండ దీపం కొండెక్కిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

కాగా, గత రెండు రోజులుగా తిరుమలలో శ్రీవారి గర్భగుడి లోకి వెళ్లి తీసిన వీడియో అని, స్వామి వారి అఖండ దీపం కొండెక్కిందని, పండితులు స్వామి వారికి కైంకర్యాలు, సేవలు చేయడం లేదని, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యం నిజమవుతోందంటూ వైరల్ అవుతోంది. షేర్లతో హోరెత్తుతున్న ఈ వీడియో శ్రీవారి గర్భ గుడిలో తీసినది కాదని ఆయన స్పష్టం చేశారు.

అలిపిరిలోని శ్రీవారి నమూనా ఆలయంలో తీసిన వీడియో అని ఆయన ప్రకటించారు. దానిని శ్రీవారి ఆలయంగా చెబుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వదంతులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీటీడీలోని సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

టీటీడీ సొంత ఛానెల్ అయిన ఎస్వీబీసీ ఛానెల్ వారిని సైతం తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభం వరకే అనుమతిస్తామని ఆయన తెలిపారు. గర్భగుడిలోకి కెమెరాలతో ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటిది ఆలయంలో వీడియో ఎలా తీస్తారని ఆయన ప్రశ్నించారు. నకిలీ వీడియోలతో స్వామివారికి మకిలిపట్టించవద్దని ఆయన సూచించారు.

Tags: ttd, tirumala, temple, tirumala tirupati devasthanam, srivari alayam, yv subba reddy, fake video, propaganda

Advertisement

Next Story

Most Viewed