- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర దెబ్బకు తెలంగాణ అలెర్ట్.. బ్యాక్ టు వర్క్!
దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారం రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం, తాజాగా మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించడంతో మనమేం చేయాలనే విషయమై వైద్యారోగ్య శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా ఆ రాష్ట్రాల నుంచి నిత్యం వచ్చే ప్రయాణికులతో వైరస్ వ్యాపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. మహారాష్ట్రలో గతంలో వైరస్ కేసులు ఎక్కువ ఉన్న సమయంలో సరిహద్దులను మూసివేసిన సంగతిని గుర్తుచేసుకుంటూ, ఈసారి పరిస్థితి చేయిదాటిపోకముందే చర్యలు తీసుకోవాలనే విషయమై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు.
ప్రస్తుతం తొమ్మిదో తరగతి నుంచి పీజీ వరకు ఫిజికల్ క్లాస్‌లు జరుగుతుండడం, సినిమాహాళ్లు యథావిధిగా నడుస్తున్నందున మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పాసివ్ క్యారియర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మాస్కులు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్స్ లాంటి నిబంధనలు అమలుకాకపోవడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల్లో ఒకటి రెండు పాజిటివ్ కేసులు నమోదైనా వెంటనే ఐసొలేషన్ చేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వ్యాక్సిన్ వచ్చినా అది వారికి మాత్రమే రక్షణ కల్పిస్తుందని, అందరూ మాస్కు ధరించాల్సి ఉన్నా ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్‌లాక్ తర్వాత పరిస్థితులన్నీ ప్రీ-లాక్‌డౌన్ స్థాయికి చేరుకున్నారని, యథావిధిగా ఫంక్షన్లు, పెళ్లిళ్లు, రాజకీయ సభలు, సమావేశాలు, షాపింగ్ మాల్స్ రద్దీ కొనసాగుతున్నదని, తెలియకుండానే వైరస్‌ను వ్యాప్తి చేయడానికి ఇవన్నీ దోహదపడతాయన్నారు. రోడ్లమీద ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా పెరిగిందని, వ్యాక్సిన్ రావడంతోనే వైరస్ పోయిందన్న భ్రమల్లో ప్రజలున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ముంబయి, పుణె, అమరావతి, యవత్‌మాల్ తదితర నగరాల్లో లాక్‌డౌన్‌తో పాటు నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. నిత్యం తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ నగరాల నుంచి రాకపోకలు సాగుతూ ఉంటాయి. అక్కడి నుంచి వైరస్‌ను మోసుకొచ్చే అవకాశాలు లేకపోలేదన్నది అధికారుల ఆలోచన. రోజూ ఆ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులను అధికారులు పరిశీలిస్తూ, పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఆంక్షలను అమలుచేయాలన్న ఆలోచనతో ఉన్నారు.
కాగా, అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా పాజిటివ్ పేషెంట్ల కోసం ఐసొలేషన్ వార్డులు, ఐసీయూ వార్డులను సిద్ధంగా ఉంచడంతో పాటు ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రెండు రోజుల కిందటే ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పీపీఈ కిట్లు, మాస్కులు మొదలు మందుల వరకు అన్నింటిపై ఆరా తీశారు. కరోనా సమయంలో చేసిన ఏర్పాట్లన్నీ ఇప్పటికీ పటిష్టంగా ఉన్నందున ఇప్పటికిప్పుడు అదనంగా సమకూర్చుకోవాల్సినవేమీ లేకపోయినా, సిద్ధంగా ఉండడమే ముఖ్యమని సూచించారు.