కరోనా.. ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు సిద్ధం

by Shyam |   ( Updated:2020-03-31 06:25:15.0  )
కరోనా.. ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు సిద్ధం
X

దిశ, వరంగల్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్, దాని వల్ల ఎదురయ్యే ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని పంచాయతీ‌రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటివరకు 814 మంది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చారన్నారు. వారికి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశామన్నారు. అదృష్టవశాత్తు అందరికి నెగిటివ్ వచ్చిందని మంత్రి వెల్లడించారు. దీనిని జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రజలు, అధికారులు సీఎం ఆదేశాలను క్రమశిక్షణగా పాటిస్తే రానున్న రోజుల్లో కరోనా వరంగల్ దరిచేరదని భావిస్తున్నట్టు చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 615 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. నిజామోద్దీన్ వెళ్లిన వ్యక్తులందరిని గుర్తించామని, మతపెద్డలతో మాట్లాడి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్ళలోనే ఉండాలని మంత్రి సూచించారు. అలాగే హృదయం ఉన్న వారంతా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు నియంత్రణలోనే ఉన్నాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15వేల మందికి పైగా వలస కూలీలను గుర్తించగా, వారిని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఎర్రబెల్లి భరోసా నిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మరోసారి స్పష్టంచేశారు. స్కూళ్ళు, ఫంక్షన్ హాళ్ళలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, మక్కలను స్టోరేజ్ చేస్తామన్నారు.

Tags: carona, lockdown, emergecy time, minister errabelli dayakar

Advertisement

Next Story

Most Viewed