సెకండ్​ డోసు ‘గ్యాప్’ తగ్గించండి.. కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు

by Shyam |
Covid-19 vaccine wastage:
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సిన్​ ను మరింత వేగంగా పంపిణీ చేసేందుకు మొదటి, రెండో డోసుల మధ్య కాల వ్యవధిని ​తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. అంతేగాక ఇటీవల అన్ని రాష్ట్రాల వైద్యాధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్​ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా కొవిషీల్డ్​ డోసుల కాల వ్యవధిని తగ్గించడం వలన 100 శాతం వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతమయ్యే ఛాన్స్​ ఉన్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రెండో డోసు కాల వ్యవధి 12 నుంచి 16 వారాల సమయం ఉన్నందున, ఆ గడువు సమయానికి చాలా మంది టీకాలు వేసుకునేందుకు ముందుకు రావడం లేదని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గడువును మరచిపోవడం, కరోనా తగ్గిందనే అభిప్రాయం, వ్యాక్సిన్​ వేసుకునేందుకు సమయాన్ని కేటాయించలేకపోవడం వంటి కారణాలతో టీకాలకు దూరమవుతున్నట్లు వివరించారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గడువు ముగిసినా, సుమారు 25 లక్షల మంది రెండో డోసు వేసుకోలేదని స్వయంగా అధికారులే పేర్కొంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పినట్లు తెలిసింది.

స్టాక్​ పెరగడమే కారణమా?

రాష్ట్రంలో వ్యాక్సిన్​ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కొల్డ్​ స్టోరేజ్​ సెంటర్లలో సుమారు 30 లక్షలకు పైగా డోసులు ఉన్నట్లు అధికారిక రిపోర్టులు చెబుతున్నాయి. వ్యాక్సిన్​ వయల్స్​ గడువు కేవలం ఆరు నెలల మాత్రమే ఉన్నందున, వీటిని వేగంగా పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతోనే డోసు డ్యాప్​ లను తగ్గించాలని రాష్ర్ట ప్రభుత్వం కోరినట్లు సెక్రటేరియట్​ లోని ఓ ఉన్నతాధికారి దిశకు తెలిపారు.

అప్పుడు అలా..ఇప్పుడు ఇలా..ఏదీ నిజం?

డోసుల మధ్య గ్యాప్​ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కోసారి ఒక్కో విధానాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కొవాగ్జిన్​ విషయంలో ఎలాంటి మార్పులు లేకపోయినా, కోవిషీల్డ్​ అంశంలో అనేక మార్పులు జరిగాయి. వాస్తవంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పుడు కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ల మధ్య కాల వ్యవధి 4 నుంచి 6 వారాలుగా ఉండేది. ఆ తర్వాత దీన్ని 4-8 వారాలకు పెంచారు. చివరగా రెండు డోసుల మధ్య కాలవ్యవధిని 12-16 వారాలకు పెంచారు. టీకా పొందిన తర్వాత రీయాక్షన్లకు చెక్​ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో కేంద్రం పేర్కొన్నది. కొవిషీల్డ్​ గ్యాప్​ ఎంత పెరిగితే అంత మంచిదని గతంలో స్పష్టం చేసింది. దీంతో బ్లడ్​ క్లాట్స్​, హార్డ్​ స్ర్టోక్​, కండరాల బలహీనత వంటి సమస్యలు రావని శాస్త్రవేత్తలు సూచించినట్టు కేంద్రం వివరించింది. నిపుణుల సూచన మేరకు మాత్రమే కాల వ్యవధిని పెంచినట్లు తెలిపింది.

అంతేగాక తొలి డోసు వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కావడంతో రెండో డోస్‌ కాల వ్యవధిని పొడగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. కానీ విదేశాలకు వెళ్లే వారికి మాత్రం మొదట్లో ఉన్న 4 నుంచి 6 వారాల కాల వ్యవధిలోనే డోసులు పంపిణీ చేయడం గమనార్హం. అప్పట్లో డోసులు కొరతతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిప్పికొట్టాయి. కానీ మళ్లీ డోసులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అడగటం చూస్తే డోసులు కొరతతోనే ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed