అవినీతి దందా.. లైసెన్సుల జారీలో బ్రోకర్లదే హవా..

by Aamani |
అవినీతి దందా.. లైసెన్సుల జారీలో బ్రోకర్లదే హవా..
X

దిశ,కోదాడ: కోదాడ ఎంవీఐ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. లైసెన్స్ కావాలన్నా రిజిస్ట్రేషన్ కార్డు జారీ చేయాలంటే రూ.500 -రూ.1000 లంచం ఇవ్వాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా కాకనే పైన నగదు వసూలు చేస్తున్నారు. అధికారులకు చేతులు తడిపేందుకు మధ్య దళారీలను నియమించుకున్నట్లు సమాచారం. వాహన దారులకు నేరగా సేవలు అందించాల్సిన ఉద్యోగులు మధ్యలో మధ్యవర్తులను నియమించుకొని వారి ద్వారా అవినీతికి పాల్పడుతున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు లైసెన్స్ రెన్యువల్ కి లైసెన్సుల జారీకి ఒక్కొక్క దానికి ఒక్కో రేటు పెట్టి డబ్బులు గుంజుతున్నారు .ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏమీ తెలియనట్లు ఉండడం విశేషం. అంటే మామూళ్లలో వాటా కింది నుండి పై దాకా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని వాహనదారులు కోరుతున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు..

ఎంవీఐ కార్యాలయంలో ఏ పని కావాలన్నా ముడుపులు అప్పజెప్పాల్సిందే వాహనదారులు బహిరంగ చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. పైసలు ఉంటేనే ఏ పనైనా జరుగుతుందని డ్రైవింగ్ వచ్చిన రాకపోయినా ముడుపులు చెల్లిస్తే లైసెన్స్ జారీ అవుతుంది. పైసలు లేనిదే ఫైల్ కదలదు అని బహిరంగ చర్చించుకుంటున్నారు. లైసెన్స్ కావాలంటే ముందుగా చలానా టూ త్రీ ఫోర్ కి రూ.600 కట్టి చలానా తీసుకోవాలి మరల రూ.1800 పెట్టి స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే సరిపోతుంది కానీ అధికారులు అదనంగా రూ. 500-రూ.1000 అడుగుతున్నట్లు సమాచారం.

ఇటీవల అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ కోసం వెళ్లగా అతన్ని అదనంగా వేయి రూపాయలు ఇవ్వాలని లేకుంటే లైసెన్స్ ఇవ్వడం కుదరదని సంబంధిత అధికారులు హుకుం జారీ చేశారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని వెళ్లిన ఆ ప్రైవేట్ వ్యక్తికి రూ.500 -రూ. 1000 అప్ప చెపితేనే పని జరుగుతుందని లేకుంటే జరగదని ప్రజలకు బహిరంగ చర్చించుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు పట్టుకొని వాడికి ఇన్సూరెన్స్ తదితర పత్రాలు లేకున్నా పైకం చెల్లిస్తే దర్జాగా వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అనంతగిరి రోడ్ లో ఉన్న పాఠశాల వ్యాన్ తనిఖీ చేసిన క్రమంలో దానికి ఇన్సూరెన్స్ లేకపోయినా డబ్బులు చెల్లించి వాహనాన్ని దర్జాగా వదిలేశారు.

ఆయన చెప్పిందే వేదం చేసేదే పని..

ఆ కార్యాలయంలో ఏ పని జరగాలన్న ఆయన్ని కలిస్తేనే ఎంత పనైనా జరుగుతుంది. ముందుగా ఏ పని జరగాలన్న ఆయనను కలిసి చెప్పినాకే ఎంత పనైనా చిటికెలో అవుతుందని లైసెన్స్ కావాలన్నా, కాగితాలు మారాలన్న ముందుగా ఆయనను దర్శనం చేసుకోవాలని వాహనదారులు చెప్పుకొస్తున్నారు. ఏదైనా వాహనం తెచ్చి ట్రైలేస్తే ఆ వాహనం పనిచేయకున్న డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మొదటగా వెళ్లి ఆయన దర్శనం చేసుకుని వస్తే పని చిటికలోనే జరిగిపోతుంది. ఆ కార్యాలయంలో పని చేయకున్నా ఆయన చెప్పిందే వేదం చేసేదే పని అని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ప్రైవేట్ వ్యక్తులు హాల్ చల్...

ఎంవీఐ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఏజెంట్లతో కార్యకలాపాలు సాగిస్తూ అందిన కాడికి అధికారులు దోచుకుంటున్నారు. ఆయనకు నచ్చని ఏజెంట్లను దూరం పెడుతూ వారికి కోడ్ లను ఏర్పాటు చేసి ఆ కోడ్ తో వచ్చిన ఫైళ్లను ముందుగా పరిశీలిస్తారు. కార్యాలయంలో మధ్యవర్తులు ఏజెంట్లు ఇష్టానుసారంగా వాహన దారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ లో ఇబ్బందులు ఉన్న మేమే అంతా చూసుకుంటాము అని చెప్పి వేల రూపాయలు వసూలు చేస్తూ దానిలో వాటా అధికారులకు ఇస్తున్నారు. అధికారులు ఈ మధ్యవర్తులు ద్వారా తమ చేతికి మట్టి అంటకుండా పనులు చేయించుకుంటున్నారు.

మా దృష్టికి రాలేదు..: ఆర్టీఏ సురేష్ రెడ్డి

ఎంవీఐ కార్యాలయంలో అవినీతి జరుగుతుందని మా దృష్టికి రాలేదు. వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.ఇలా ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Advertisement

Next Story