- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్.. త్వరలో రూ.9,500 కోట్లతో పనులు
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో విదేశీ పెట్టుబడులు రావాలన్నా.. రియల్‌ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవాలన్నా.. ఐటీ, ఫార్మా కంపెనీలు రావాలన్నా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ప్రధాన భూమిక పోషించనున్నాయి. అందుకోసమే రాష్ట్రప్రభుత్వం మెగా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించింది. నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధితో పాటు స్టీల్ బ్రిడ్జీలు, అండర్ పాసుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. వీటి పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు ప్యారడైజ్ నుంచి రాజీవ్ రహదారి వరకు, ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటితో పాటు సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక ఫ్యూచర్ సిటీకి రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు. ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చిన మిరాలం ట్యాంకుపై వంతెన పనులను త్వరలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు బస్ టర్మినల్స్, మెట్రో టర్మినల్స్, లాజిస్టిక్ పార్కులను సైతం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
రూ.5,106 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్లు..
ఎంతో కాలంగా కేంద్ర రక్షణ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు అవసరమైన రక్షణ శాఖ భూములకు ఆమోదం పొందడంతో పాటు ప్రైవేటు భూములను సేకరించడానికి నోటిఫికేషన్ కూడా జారీచేశారు. జనవరిలో భూసేకరణ పనులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 రోజుల్లో పనులను ప్రారంభించే అవకాశముంది. రాజీవ్ రహదారిపై (ఎస్‌హెచ్-01) ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.124 కిలోమీటర్ల పొడవుతో 108.21 ఎకరాల రక్షణ భూమిలో రూ.3,619 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. భూసేకరణ పరిహారం కోసం రూ.1,565.65 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి వెస్ట్‌మారేడ్‌పల్లి, కార్ఖాన, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూముకుంట, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) జంక్షన్ వద్ద ముగియనుంది. దీంతో పాటు ఎన్‌హెచ్-44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ వరకు రూ.1,487 కోట్ల వ్యయంతో 5.32 కి.మీ. పొడవుతో 42.26 ఎకరాల రక్షణ శాఖ భూమిలో ఒక కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఆ కారిడార్‌లో భూసేకరణ కోసం రూ.387 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ కారిడార్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి సికింద్రాబాద్, తాడ్ బండ్ జంక్షన్, బోయినిపల్లి జంక్షన్ మీదుగా డైరీఫామ్ వద్ద ముగియనున్నది. ఈ కారిడార్ పూర్తయితే నాగ్‌పూర్ జాతీయ రహదారి మార్గంలో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్నల్, ఆదిలాబాద్, నాగ్‌పూర్ వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
మిరాలం ట్యాంకుపై వంతెన, టూరిజం..
బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్-44)ను చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా మిరాలం ట్యాంకు మీదుగా రూ.363.00 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల హై లెవల్ వంతెన నిర్మాణానికి ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మిరాలం ట్యాంకు సుందరీకరణలో భాగంగా లేక్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తో పాటు పర్యాటకంగాను అభివృద్ధి చేయనున్నారు. ఈ వంతెనతో పాటు ప్రయాణికులకు సమయం ఆదా చేయడంతో పాటు పర్యాటక అభివృద్ధిని ప్రమోట్ చేసేవిధంగా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పర్యాటక ప్రాంత అభివృద్ధికి సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) పురోగతిలో ఉందని అధికారులు చెబుతున్నారు.
ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్‌ఆర్..
ఫ్యూచర్ సిటీపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం 41.5 కిలో మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) రావిర్యాల ఇంటర్ ఛేంజ్ నుంచి త్రిపుల్ ఆర్ ఆమన్‌గల్ వరకు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆరు లేన్ల రోడ్డు చేపట్టనున్నారు. దీన్ని భవిష్యత్‌లో ఎనిమిది లేన్లకు పెంచే అవకాశముంది. ఈ రోడ్డుకు ఇరువైపుల ఆరు లేన్ల సర్వీస్ రోడ్డుతో పాటు మూడు మీటర్ల సైకిల్ ట్రాక్, రెండు మీటర్ల ఫుట్‌పాత్ కూడా నిర్మించనున్నారు. మొదటి దశలో ఓఆర్ఆర్ రావిర్యాల్ ఇంటర్ ఛేంజ్ నుంచి మీర్ఖాన్‌పేట్(ఫ్యూచర్ సిటీ) వరకు రూ.1,665 కోట్లతో 18 కిలో మీటర్ల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికోసం 447.29 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ పరిహారం కోసం రూ.246 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ సర్వే కూడా పూర్తయింది. రెండో దశలో మీర్ఖాన్‌పేట్(ఫ్యూచర్ సిటీ) నుంచి త్రిపుల్ ఆర్ ఆమన్‌గల్ వరకు రూ.2,365 కోట్లతో 23.50 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికోసం 589.63 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.345 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రోడ్డు ఐదు ఫారెస్టు బ్లాకులకు సంబంధించిన 208 ఎకరాల నుంచి వెళ్తుందని అధికారులు గుర్తించారు. దీని కోసం త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రాజెక్టులు: హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్
హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులకు ఊతమిచ్చేలా మెగా ప్రాజెక్టులను చేపట్టనున్నాం. 10 రోజుల్లో రెండు ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన పనులను ప్రారంభించనున్నాం. మిరాలం ట్యాంకు వంతెన నిర్మాణంతో పాటు ఆ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కాలంలో ఈ ఐదు మెగా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.