పంచాయతీ కార్యదర్శుల్లో టెన్షన్.. టార్గెట్ చేసిన సర్కార్

by Anukaran |   ( Updated:2021-07-09 01:54:14.0  )
Workload on Panchayat Secretaries
X

దిశ, తెలంగాణ బ్యూరో : కిందిస్థాయి ఉద్యోగులే టార్గెట్‌‌గా పల్లె ప్రగతి సాగుతోంది. ఎన్ని రోడ్లు ఊడ్చారు, ఎన్ని బావులను మట్టితో పూడ్చారు, ఎన్ని చెట్లు నాటారనే వివరాలతో పాటు ఒక్క రోజు ఎంతమంది కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు, ఎంతమందిని సస్పెండ్​ చేశారనే వివరాలను సైతం ఫార్మాట్​లో అడుగుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. పని చేసే వారి కంటే పర్యవేక్షకులే ఎక్కువవుతున్నారు. సిబ్బందిపై ఎలా చర్యలు తీసుకోవాలనే కారణాలను వేతికేందుకే అధికారులు గ్రామాలకు తరలుతున్నారు. మరోవైపు జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలే సరిగా ఇవ్వడం లేదు కానీ పల్లె ప్రగతిలో మాత్రం మోయలేని భారాన్ని మోపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ రెండు రోజుల వ్యవధిలో దాదాపు 11 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేయగా… ఒకరిని విధుల నుంచి తొలగించినట్లు రోజువారీ నివేదికల్లో వెల్లడించారు. మొత్తం 810 పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు.

పని ఒక్కరిది… పరిశీలనకు పదుగురు

గ్రామంలో ఒక్క పంచాయతీ కార్యదర్శిపై దాదాపు ఐదారు మంది ఇన్‌చార్జీలు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారిని స్పెషలాఫీసర్​గా నియమించారు. ఆ స్పెషలాఫీసర్​తో పాటు మండల ఎంపీడీఓ, తహసీల్దార్‌లు​ ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి తోడుగా క్లస్టర్ల వారీగా పర్యవేక్షకులను నియమించారు. అంతేకాకుండా డివిజన్​ స్థాయి అధికారులతో ఫైలట్​ టీం, ఫ్లయింగ్​ స్క్వాడ్​ పేరుతో ఆర్డీఓ, డీపీఓ, పీడీలను నియమించారు. ఆ తర్వాత అడిషనల్​ కలెక్టర్లతో సూపర్​ స్క్వాడ్​గా గ్రామాలకు పంపిస్తున్నారు. చివరకు కలెక్టర్లతో స్పెషల్​ సూపర్​ స్క్వాడ్​ను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రస్థాయి అధికారులకు కూడా ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను కేటాయించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గ్రామాల్లో పనులు చేయాల్సింది కేవలం గ్రామ కార్యదర్శి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లను కూడా తొలగించిన తర్వాత ఊరి పనులన్నీ వారిపైనే పడుతున్నాయి. దీంతో పనిభారం పెరుగుతోంది. ఇప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమం మరింత భారమవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు నివేదికలతో వేపుకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం కలెక్టర్లు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్​, మధ్యాహ్నం అడిషనల్​ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​, సాయంత్రం కలెక్టర్లు, డీపీఓలతో మళ్లీ ఫోన్​ కాన్ఫరెన్స్​… ఇలా వరుస సమావేశాలు కూడా తగ్గడం లేదు.

కారణం చూసి వేటేయాల్సిందే

ప్రోత్సహించి పని చేయించుకునే విధానానికి పాతరేశారు. పల్లె ప్రగతి ఫార్మాట్​లో ఇప్పుడు రోజూ ఎంతమంది కార్యదర్శులను సస్పెండ్​ చేశారు, ఎంతమందికి మెమోలు జారీ చేశారనే కాలమ్​లో వివరాలు అడుగుతున్నారు. రోజువారి విధులతో పాటు చిన్న జిల్లాలు కావడంతో ప్రతి మండలంలో రోజుకో గ్రామానికి కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు, డీపీఓలు, ఆర్డీఓలు, పీడీలు… ఇలా ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మంత్రులు… ఇలా వీళ్ల పర్యటనలు కూడా ఉంటున్నాయి. వీటన్నింటినీ చూడాల్సింది పంచాయతీ కార్యదర్శులే.

అయితే ఇప్పుడు గ్రామస్థాయిలో సిబ్బందిని బెదిరించడం, వారికి నోటీసులు ఇవ్వడం, సస్పెండ్​ చేయడం అదో ఫ్యాషన్​గా మారింది. చిన్న చిన్న కారణాలను చూపిస్తూ వేటు వేస్తున్నారు. వేతనాలను కట్​ చేస్తున్నారు. రోడ్లపై చెత్త ఉందని, మొక్కలకు కంచె లేదని, సరిగా పెరుగడం లేదనే కారణాలను వెతికి మరీ పట్టుకుంటున్నారు. గ్రామాల్లో సవాలక్ష పనుల్లో సతమతమవుతున్న ఉద్యోగులపై చిన్న చిన్న కారణాలను సాకుగా చూపిస్తూ ఇంటికి పంపిస్తుడటం, జీతాల్లో కోత పెట్టుతుండటం, నోటీసులు ఇస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైసల్లేవ్​..!

మరోవైపు గ్రామ పంచాయతీల ఖాతాల్లో రూపాయి కనిపించడం లేదు. పల్లె ప్రగతి నిధులు వచ్చినా… అవి వేతనాలకే సరిపోతున్నాయి. ఇప్పటికే ట్రాక్టర్ల ఈఎంఐలు, డీజిల్​, నిర్వహణ చాలా భారంగా మారుతోంది. అటు గ్రామాలకు వస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటనలకు వేలు ఖర్చు అవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలో అర్థం కావడం లేదు. గ్రామానికి కలెక్టర్​ పర్యటనకు వెళ్తే కనీసం రూ. నాలుగైదు వేలు సొంతంగా పెట్టుకుంటున్నారు. వాటర్​ బాటిళ్లు, బిస్కెట్లు, చాయ్​లతో పాటు దండలు, బోకేలు… ఇలా ఖర్చు వస్తూనే ఉంటోంది. ఒకవేళ మధ్యాహ్నం వస్తే లంచ్​ ఏర్పాట్లు చేయాల్సి ఉంటోంది. వీటన్నింటినీ ముందుగా కార్యదర్శులు పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత బిల్లులు పెడితే మాత్రం సగానికి కోత పెట్టి ఎంతో కొంత చెల్లిస్తున్నారు. అవికూడా నెలల తరబడి రావడం లేదనే ఆరోపణలున్నాయి. పంచాయతీల్లో పైసలు లేకపోవడం, ఉన్న వాటిలో తీసుకునేందుకు సర్పంచ్​ల నుంచి సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సర్పంచ్​, కార్యదర్శుల మధ్య సయోధ్య ఉంటే ఒకే కానీ… కొంత విభేదాలు వచ్చినా ఇలాంటి బిల్లులు రానట్టే. తాజాగా నిజామాబాద్​ జిల్లాలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేయగా… ఒకరిని విధుల నుంచి తొలిగించారు. కరీంనగర్​ జిల్లాలో దాదాపు 10 మందికిపైగా నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు సుమారు 800 మందికి నోటీసులు ఇచ్చినట్లు పల్లె ప్రగతి రోజువారి నివేదికల్లో వెల్లడించారు.

Advertisement

Next Story