కరోనా పరిస్థితులను బట్టి విద్యా సంస్థల ఓపెనింగ్

by Shyam |   ( Updated:2020-07-22 11:46:25.0  )
కరోనా పరిస్థితులను బట్టి విద్యా సంస్థల ఓపెనింగ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులకు అనుగుణంగా విద్యా సంస్థలను తిరిగి తెరిచే అంశంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని, నిర్దిష్టంగా ఇప్పుడే తేదీలనుగానీ, షెడ్యూలునుగానీ రూపొందించలేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుందనేదానిపైనా ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని చెప్పింది. ప్రస్తుతం అన్ని కోణాల నుంచి ఆలోచిస్తూ ఎప్పటి నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం సముచితంగా ఉంటుందనేదానిపై కసరత్తు చేస్తూ ఉన్నామని, ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది. ఆన్‌లైన్ తరగతులు, విద్యా సంస్థల పునఃప్రారంభంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై అంశాలను అఫిడవిట్‌లో వెల్లడించింది.

ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ మొదలు విద్యా సంస్థలను తెరవడంపై కేవలం ప్రభుత్వం మాత్రమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా విద్యార్థులను పంపడంలో తల్లిదండ్రులకు ఉన్న భయాలు, అపోహలు, వారి సన్నద్ధత తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లోని పేరెంట్స్ నుంచి అభిప్రాయాలను తీసుకుని క్రోడీకరించి నివేదిక రూపంలో తెలియజేయాల్సిందిగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ ఆఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా విద్యా సంస్థలను తెరవడం, ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడం, విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయడం ఆధారపడి ఉంటుందని, వీటన్నింటికంటే మించి కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టుకు లిఖితపూర్వకంగా ప్రభుత్వం తెలియజేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను కోర్టుకు కూడా సమర్పిస్తామని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed