టార్గెట్ కరీంనగర్.. మరో వ్యూహం రచించిన టీఆర్ఎస్.. రంగంలోకి రంగారెడ్డి నేతలు

by Anukaran |   ( Updated:2021-12-07 06:40:06.0  )
టార్గెట్ కరీంనగర్.. మరో వ్యూహం రచించిన టీఆర్ఎస్.. రంగంలోకి రంగారెడ్డి నేతలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలే కాకుండా టీఆర్ఎస్ అధిష్టానం మరో ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఇక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వారే కాకుండా అదనంగా మరో ఇద్దరికి కూడా బాధ్యతలు అప్పగించింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులకు కూడా బాధ్యతలు అప్పగించింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాలన్న సంకల్పంతో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడటం లేదట.. ఇందులో భాగంగానే పట్నం, శంభీపూర్ రాజులకు ప్రత్యేకంగా కరీంనగర్ ఎలక్షన్ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. వీరు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు వేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో వీరిద్దరూ కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ క్యాంపులో ఉన్న నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో టచ్‌లో ఉంటున్నారు. క్యాంపునకు కూడా హాజరై పార్టీ అభ్యర్థుల గెలుపునకు అన్ని రకాలుగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మరింత సీరియస్‌గా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. క్రాస్ ఓటింగ్‌కు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed