అదే జరిగితే టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ?

by Anukaran |   ( Updated:2020-12-02 07:57:17.0  )
అదే జరిగితే టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ?
X

దిశ, వెబ్‌డెస్క్: చివరివరకు చిరాకు తెప్పించి… అనూహ్యంగా పెరిగిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతం అధికార టీఆర్ఎస్‌‌ పార్టీని కంగారు పెడుతోంది. మంగళవారం సాయంత్రం 4గంటల వరకూ పోలింగ్ మందకొడిగా సాగడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నమోదు కావట్లేదని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ చివరి రెండుగంటల్లో ‌పుంజుకొని గతంలోని ఓటింగ్ శాతానికి చేరుకోవడంతో డివిజన్ అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. అయితే గతంలో కంటే పోలింగ్ శాతం ఐదారు పెరిగితే.. అధికార పార్టీకి వ్యతిరేకంగానే పడిందని భావించే వారు. కానీ, సాయంత్రం వరకు పట్టణ ఓటర్లు సైలెంట్‌గా ఉండి ట్విస్ట్ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎంఐఎంతో మేయర్ పీఠాన్ని పంచుకునేది లేదని, సొంతంగానే కుర్చీని దక్కించుకుంటామని స్పష్టం చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఒకవేళ హంగ్‌ పరిస్థితులు వస్తే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మథన పడుతున్నట్లు తెలుస్తోంది. 150డివిజన్లు ఫ్లస్ 52ఎక్స్ అఫిషియో ఓట్లను కలుపుకుంటే మేజిక్ ఫిగర్ 102గా ఉంటుంది. టీఆర్ఎస్‌కు 38ఎక్స్‌అఫిషియో ఓట్లు ఉండగా (వీరిలో ఇప్పటికే ఆరుగురు శివారు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి) సొంతంగా 70 సీట్లు గెలిస్తేనే మేయర్ స్థానం సాధ్యం అవుతోంది. తక్కువ డివిజన్లు గెలిచి ఎంఐఎం సపోర్టు తీసుకుంటే వాళ్ల పెత్తనం పెరిగిపోవడమే గాక, ప్రచారంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరి.. టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి భవిష్యత్‌లో ఇబ్బందికర పరిణామాలు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీటితో పాటు మరో అంశాన్ని పరిశీలిస్తే.. టీఆర్ఎస్ ఒకవేళ 55సీట్లే నెగ్గితే మరింత టెన్షన్ పడటం ఖాయం. ఎందుకంటే.. ఈ 55 సీట్లకు.. 32ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపితే మొత్తం టీఆర్ఎస్ సంఖ్య 87మాత్రమే అవుతుంది. అప్పుడు ఇంకా 15సీట్లు అవసరం అవుతాయి. కాంగ్రెస్ 8 నుంచి 10 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో… వీరితో పాటు.. పాతబస్తీలో గెలిచే ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకం అవుతారు. బయట నుంచి కాంగ్రెస్ మద్దతిస్తే.. అటు ఇటో నెట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి కానీ 50కి లోపు మాత్రం సీట్లు సాధిస్తే 20మంది మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సిచ్వేషన్ వస్తే ఇక ఎంఐఎం మద్ధతే శరణ్యం అవుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అటు.. ఎంఐఎంతో కుర్చీ షేర్ చేసుకోకుండా ఉండటంతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌కు ధీటుగా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనగా, మంగళవారం చివరి రెండు గంటల్లో జరిగిన పోలింగ్ అధికార పార్టీ నేతలకు అసలు ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఇవన్నీ పక్కనపెట్టి ఎంఐఎంతో కలిసి గ్రేటర్ కుర్చీని దక్కించుకున్నా.. బీజేపీ 30నుంచి 40సీట్లు సాధిస్తే కౌన్సిల్‌లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఈ పరిణామాలను భేరీజు వేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు… ఎల్లుండి ఫలితాల్లో తక్కువ సీట్లు గెలిస్తే ఎలా ముందుకెళ్లాలన్న వ్యూహాల్లో తలమునకలయ్యారు.

Advertisement

Next Story

Most Viewed