అసంతృప్తులకు చెక్.. రైతు కేంద్రంగా టీఆర్ఎస్ ప్రోగ్రామ్స్!

by Anukaran |   ( Updated:2021-12-16 22:33:37.0  )
Chief Minister KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతన్న కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతుబంధుకు తోడుగా పలు కార్యక్రమాలను శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. మరోపక్క బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామస్థాయిలోకి వెళ్లేందుకు యత్నిస్తున్న ఆ పార్టీని అడ్డుకునేలా పార్టీ శ్రేణులకు నిర్దేశం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. సోషల్ మీడియా పటిష్టం, రైతుబంధు సమితి సభ్యులకు శిక్షణ, పార్టీ పదవుల భర్తీ, గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. రైతులపక్షాన టీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తోంది. 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ వర్తింపజేస్తోంది. అయితే యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. దీంతో రైతుల్లో, ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. దానిని పోగొట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికల ద్వారా రైతులకు పంటసాగుపై అవగాహన, రాయితీలు, ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించనున్నారు. ప్రత్నామ్యాయ పంటలు వేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డీసీఎంఎస్, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లకు సూచనలు చేయనున్నారు. రైతుబంధు ఎవరికి ఇవ్వాలనే అంశంపై కూడా పార్టీ నేతల అభిప్రాయం సేకరించనున్నట్లు సమాచారం.

హుజురాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ అధిష్టానం క్షుణ్నంగా పరిశీలిస్తుంది. బీజేపీకి ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతుండటం, గ్రామస్థాయిలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే సోషల్ మీడియాను పటిష్టం చేసి ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిపై ఎదురుదాడి చేస్తోంది. దానిని నివారించేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. టీఆర్ఎస్ సోషల్ మీడియాను పటిష్టం చేయడంతో పాటు నాయకులు సైతం బీజేపీ చేసే విమర్శలకు ప్రతివిమర్శలు చేసి తిప్పికొట్టేలా టీఆర్ఎస్ అధిష్టానం సన్నద్ధమవుతోంది. బీజేపీ రూరల్‌లో బలోపేతం కాకుండా నిరోధించేందుకు కార్యాచరణ చేపడుతోంది టీఆర్ఎస్. అదే విధంగా ప్రతిపక్షాలు దళిత బంధుపై చేస్తోన్న దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులను కేసీఆర్ సన్నద్ధం చేయనున్నారు.

టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. పదవులు రానివారు నిరాశచెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తామని, ఎవరి సేవలను ఎలా వినియోగించుకోవాలో కార్యచరణ చేపట్టినట్లు నేతలకు పార్టీ అధినేత ప్రకటించనున్నారు. అదే విధంగా పొలిట్ బ్యూరోలోకి సీనియర్లను తీసుకుంటామనే సంకేతాలను సైతం ఇవ్వనున్నారు. పార్టీకోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అందరికీ అవకాశం కల్పిస్తామని కేసీఆర్ పార్టీ నేతలకు హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి తోడు దళితబంధుపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు మార్గనిర్దేశనం చేయనున్నారు.

పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ కార్యాచరణపై ఎంపీలతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ సమావేశం జరుగలేదు. దీంతో కేంద్రం తీరును ఎండగట్టాలని, ప్రజలు, రైతులకు టీఆర్ఎస్ పార్లమెంట్‌లో పోరాటం చేసిన తీరును వివరించేందుకు తెలంగాణ భవన్‌లో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు పర్యటనలకు సంబంధించిన కార్యచరణపై చర్చించనున్నట్లు తెలిసింది.

నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమావేశం

తెలంగాణ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి 300 నుంచి 400 మంది వరకు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటం, ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో పార్టీ నేతలతో ఉమ్మడి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

వరి వేస్తే రైతుబంధు కట్.. చిరునవ్వుల్లో సీఎం

Advertisement

Next Story

Most Viewed