టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ.. క్షణ క్షణం… టెన్షన్ టెన్షన్..

by Shyam |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం టీఆర్ఎస్ లో ఆశావాహులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం డెడ్‌లైన్ కావడంతో పార్టీ అధినేత ఎవరి పేరును ఖరారు చేస్తారోనని క్షణ క్షణం ఉత్కంఠకు లోనవుతున్నారు. కార్తీక సోమవారం, ఏకాదశి తిథి మంచి రోజు కావడంతో నామినేషన్లను దాఖలు చేయాలనుకుంటున్నారు. అభ్యర్థుల పేర్లను అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రానికే ప్రకటిస్తారని భావించారు. రాకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కల్లా పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉందంటూ ఎదురుచూపుల్లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్, కేటీఆర్ నుంచి కొద్దిమందికి ఇప్పటికే సూచనప్రాయంగా సమాచారం వెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎన్సీ కోటిరెడ్డి, పెద్దిరెడ్డి, ఎల్ రమణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్, తదితర ఇరవై మంది ఆశలు పెట్టుకున్నారు.

ఇందులో కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలు, కులాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థుల పేర్లను ఆదివారం సాయంత్రానికే ప్రకటిస్తే నామినేషన్ పత్రాలను రెడీ చేసుకుని కార్తీక సోమవారం రోజున దాఖలు చేయాలని షెడ్యూలు చేసుకున్నారు. కానీ అనుకున్నట్లుగా జాబితా రాకపోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తోడుగా తొమ్మిది జిల్లా (ఉమ్మడి)ల పరిధిలోని స్థానిక సంస్థల కోటా కింద మరో 12 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా త్వరలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్నది. ఈ పన్నెండు మందిలో ఎవరికి అవకాశం లభిస్తుందోననే చర్చలూ మొదలయ్యాయి. ఒకేసారి ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారనే అభిప్రాయం వచ్చింది. కానీ ఏ కోటా పేర్లనూ ప్రకటించలేదు. సోమవారానికైనా జాబితాలో రెండు కేటగిరీల అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఒకేసారి ప్రకటిస్తారా? లేక తొలుత ఎమ్మెల్యే కోటాది మాత్రమే ప్రకటించి స్థానిక సంస్థల అభ్యర్థుల పేర్లను రెండో జాబితాగా ఇస్తారా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఒక కోటాలో అవకాశం రాకపోతే రెండో కోటాలోనైనా వస్తుందేమోనని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story

Most Viewed