‘భూ’ బకాసురుడిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. కేసీఆర్ స్పందిస్తారా..?

by Anukaran |   ( Updated:2021-07-27 07:37:53.0  )
gandra satya narayana
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్‌పాక గ్రామ శివారు వ్యవసాయ భూములపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కన్ను పడిందని అందువల్లనే భూములకు పట్ట పాసుబుక్కులు ఉన్న ఫ్రీజింగ్ లో పెట్టారని ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం మండలంలోని వరికోల్ పల్లి, కుమ్మరిపల్లి రైతులు తమ భూములను అన్యాయంగా తొలగించారంటూ చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అక్కడ ఓ మహిళ రైతు భూముల గురించి మాట్లాడితే తన భర్తను చంపుతానని నైన్ పాక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు తొట్ల ఐలయ్య, గొడుగు విజేందర్,మర్రి అశోక్ లు బెదిరించారని గండ్రకు చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తాత, ముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న వేల ఎకరాల భూములను తొలగించడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని మండిపడ్డారు. ఈ భూములపై భూపాలపల్లి ఎమ్మెల్యే కన్ను పడిందని అందులో భాగంగానే ఓ ముస్లింతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కాగితాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు.

గతంలో ఇక్కడి రైతులకు మొదటగా తోక పాసుబుక్కులు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు జరిగినాక సాదాబైనామా లో సైతం నూతన పట్టా పాసు పుస్తకాలు మంజూరు అయ్యాయని ఈ భూములపై వీరి పెత్తనం ఏంటని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి రైతుల హక్కులను కాలరాస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించకుంటే రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. భూముల తొలగింపు వల్ల రైతు చనిపోతే రైతు బీమా కూడా రాదని, రైతుబంధు, క్రాఫ్ట్ లోన్ ల పేరిట ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి భూముల తొలగింపుపై తక్షణమే విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడిగా ఖచ్చితంగా గెలుపొందుతానని దీని వెనుక ఉన్న అధికారులు, నాయకుల భరతం పట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముకిరాల మధువంశీ క్రిష్ణ , చిట్యాల ఎంపీటీసీ 2 దబ్బేట అనిల్, చిలుకల రాయకొమురు, దొడ్డి కిష్టయ్య, ఎరవెల్లి సాంబలక్ష్మి భద్రయ్య, గంగాధర రవి, బుర్ర లక్ష్మణ్, నక్క భాస్కర్, కుమార్, శంకర్, ప్రతాప్, రాజు, నరేష్, దేవేందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed