- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ సభ్యత్వముంటేనే ప్రభుత్వ పథకాలు..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు సగమే పూర్తయింది. ఇప్పటికే గడువు పూర్తికాగా, లక్ష్యం చేరేందుకు పార్టీ శ్రేణులు ఆపసోపాలు పడుతున్నారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా టార్గెట్ విధించగా.. పూర్తి చేసేందుకు కొన్నిచోట్ల ప్రభుత్వ పథకాలకు మెలిక పెట్టారనే విమర్శలున్నాయి. చాలా చోట్ల సభ్యత్వ రుసుం రాకపోగా, ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులే సొంతంగా డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలాఖరు వరకు గడువు పెంచగా.. ఆన్లైన్ ప్రక్రియ మరింత నెమ్మదిగా సాగుతోంది.
12 నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు..
2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్.. ఈ ఏడాదితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. ప్రతీ రెండేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత నిర్మాణం చేస్తారు. ఈ నెల 12 నుంచి సభ్యత్వ నమోదు చేపట్టగా, వాస్తవానికి 25 లోగా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే గడువు కూడా ముగిసింది. ప్రతీ నియోజకవర్గానికి 50 వేల చొప్పున, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సాధారణ సభ్యత్వం రూ.35, క్రియాశీల సభ్యత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.50, ఇతరులకు రూ.100 చొప్పున రుసుం తీసుకుంటున్నారు.
జిల్లాకో సెక్రెటరీ ఇన్చార్జి
సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తికి ప్రతి జిల్లాకో సెక్రెటరీ ఇన్చార్జిని నియమించగా.. తూర్పు, పశ్చిమ జిల్లాలకు ఇద్దరు జనరల్ సెక్రెటరీ ఇన్చార్జిలను వేశారు. నిర్మల్ జిల్లాకు టీఎస్ డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు అరిగెల నాగేశ్వరరావును నియమించగా, జనరల్ సెక్రెటరీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ ను వేశారు. మంచిర్యాల జిల్లాకు గూడూరి ప్రవీణ్, ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ సెక్రటరీ ఇన్చార్జిలు కాగా, జనరల్ సెక్రెటరీ ఇన్చార్జిగా రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను నియమించారు. వీరంతా నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. రెండు వారాల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు సగం కూడా లక్ష్యం చేరలేదు.
అంతంత మాత్రంగానే
ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా.. మిగతా చోట్ల సభ్యత్వ నమోదు అంతంత మాత్రంగానే ఉంది. నిర్మల్ జిల్లాలో సుమారు లక్ష మంది సభ్యత్వ నమోదు చేయగా, 70 శాతం పూర్తయింది. అత్యధికంగా నిర్మల్ నియోజకవర్గంలో 40 వేల వరకు చేయగా, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ఉంది. చెన్నూర్ లో 50 వేల సభ్యత్వ లక్ష్యం పూర్తవగా.. బెల్లంపల్లిలో 30 వేలు పూర్తయింది. ఒక్కో నియోజకవర్గం నుంచి సభ్యత్వ రుసుం కింద రూ.22 లక్షల చొప్పున తెలంగాణ భవన్ లో చెల్లించాల్సి ఉంది. కొన్ని చోట్ల నుంచి మాత్రమే డబ్బులు చెల్లించగా, అదీ పూర్తిగా లేదు. కొన్నిచోట్ల అసలు రూపాయి కూడా చెల్లించలేదు. సభ్యత్వ నమోదు లక్ష్యం పూర్తి కాకపోవడంతో ఈ నెల 28 వరకు పొడగించారు. ఇక ఇన్లైన్ప్రక్రియ మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఖానాపూర్, ఆసిఫాబాద్ లాంటి నియోజక వర్గాల్లో సిగ్నల్ సమస్య ఉండగా, ఈ నెల 5 వరకు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
సొంతంగా డబ్బులు చెల్లింపులు..
నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలకు సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చే సమయంలోనే అధినాయకులు లక్ష్యాలు విధించారు. దీంతో చాలా చోట్ల సభ్యత్వ రుసుం రాకపోవడంతో ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులే డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల సభ్యత్వ నమోదుకు ప్రభుత్వ పథకాలకు మెలిక పెట్టారని సమాచారం. డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సబ్సిడీ పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ పథకాల రుణాలకు లబ్ధిదారులు కావాలంటే.. సభ్యత్వం తీసుకోవాలనే లింక్ పెట్టినట్లు చర్చ సాగుతోంది. కొన్నిచోట్ల సభ్యత్వ నమోదుకు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేయకపోవడం, మిగతా చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేయకపోవడం, అసంపూర్తిగా ఉండడంతో సభ్యత్వ నమోదుకు వెళ్తే.. కొన్నిచోట్ల నిరాసక్తత ప్రదర్శించారు. దీంతో సభ్యత్వ నమోదుకు నాయకులు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.