మేయర్ సీటు ఆశిస్తే.. ఉన్న సీటుకు ఎసరు..!

by Anukaran |   ( Updated:2021-04-17 11:12:55.0  )
మేయర్ సీటు ఆశిస్తే.. ఉన్న సీటుకు ఎసరు..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ సీటుపై గురిపెట్టి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని చూసిన కొంత‌మంది టీఆర్‌ఎస్ ముఖ్య నేత‌ల‌కు ఆ పార్టీ కీల‌క నేత‌లు షాకిచ్చిన‌ట్లు స‌మాచారం. మేయ‌ర్ సీటుపై క‌ల‌లు కంటూ కొంత‌కాలంగా వ్యూహాత్మకంగా పావులు క‌దిపినా.. వారికి అంతే వ్యూహాత్మకంగా పార్టీలోని కొంత‌మంది టికెట్లు దక్కకుండా చేస్తునట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే మేయ‌ర్ అవ‌కాశాల‌కు ఆదిలోనే గండికొట్టేందుకు టికెట్ వద్దనే.. నీళ్లుచాల్లుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అస‌లుకే ఎస‌రు అన్నచందంగా రేసులోనూ.. ఊసులోనూ లేకుండా చేసేందుకు స్కెచ్ గీసి అమ‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘మీకు ఆ డివిజ‌న్ సెట్ అయ్యేట్లుగా లేదు అన్నా… స‌ర్వేల్లోనూ మీకు ఇబ్బందిక‌రంగానే ప‌రిస్థితులు ఉన్నాయి.. మీ స్థాయికి ఆ ప‌ద‌వి కూడా చిన్నదే… ఓట‌మి పాలయితే మీ స్థాయికి బాగుండ‌దు… మీకు గౌర‌వం ద‌క్కేలా చూడ‌టం నా బాధ్యత. నామినేటెడ్ ప‌ద‌వులు చాలా ఉంటాయ్ అన్నా… మిమ్మల్ని చిన్నత‌నం చేయ‌లేను.. మీకు క‌చ్చితంగా గౌర‌వం ఇస్తా’ మంటూ.. టికెట్ ఇచ్చేది లేద‌న్న విష‌యాన్ని కీల‌క నేత‌లు టీఆర్ఎస్ ఆశావ‌హుల చెవిలో చల్లగా చెప్పేస్తున్నారంటా. టికెట్ ద‌క్కించుకుని ఆ త‌ర్వాత గెలిచి అధిష్టానం పెద్దలతో త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో ఎలాగోలా మేయ‌ర్ సీటును ద‌క్కించుకోవాల‌ని యోచించిన నేత‌ల‌కూ.. ఈ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ త‌గిలిన‌ట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వీరే ఆశావ‌హులు..

మేయ‌ర్ ప‌ద‌వి ఆశించి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని భావించిన వారిలో ఓ ఎమ్మెల్యేకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న నేతతో పాటు వ‌రంగ‌ల్ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్యవహరిస్తూ అధిష్టానం అండ‌దండ‌లు క‌లిగిన మ‌హిళా నేత కోడ‌లు, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ప‌నిచేస్తున్న ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ ప్రముఖ వ్యాపార‌వేత్త, ఓ విద్యా సంస్థకు చైర్మన్‌గా ఉండి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొన‌సాగుతున్న మ‌రో నేత కూడా మేయ‌ర్ స్థానంపై ఆశ‌లు పెట్టుకున్నట్లుగా చాలా రోజులుగా చ‌ర్చ నడుస్తోంది. ఇందులో ఓ ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుడు కూడా ఉన్నాడు. ఈ ఆశావహుల జాబితాలో మ‌హిళా నేత కోడ‌లుకు టికెట్ ఇచ్చేందుకు మార్గం సుగ‌మం అయినా.. మేయ‌ర్ సీటుపై ఆశ‌లు పెట్టుకోవ‌ద్దన్న సంకేతాల‌ను ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

46 టికెట్లు ఓకే.. మరో 20 సస్పెన్స్

ఆయా డివిజన్‌లల్లో ఏ అభ్యర్థిని నిల‌బెట్టాల‌నే విష‌యంపై అధికార పార్టీ ముఖ్య నేత‌లు తీవ్ర క‌స‌ర‌త్తే చేస్తున్నారు. అనేక స‌మీక‌ర‌ణాలు, భవిష్యత్ రాజ‌కీయ ప‌రిస్థితులు, సామాజిక అంశాలు, స‌ర్వే సారాంశం, ఓట‌ర్ల సంఖ్య, ఆర్థిక బ‌లాలు, ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి అభ్యర్థిని నిల‌బెట్టే అవ‌కాశాలున్నాయి. ఇలా అనేక కోణాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ల ఖ‌రారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ గెల‌వాలి.. అభ్యర్థి మ‌న‌ మాట జ‌వ‌దాట‌నివాడై ఉండాల‌నే.. ప్రాథ‌మిక రాజ‌కీయ సూత్రాన్ని అధికార పార్టీ అమ‌లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన స‌మాచారం ప్రకారం.. ఇప్పటికే వ‌ర‌కు 46 డివిజన్‌లల్లో పార్టీ అభ్యర్థుల ఎవరు అనే దానిపై ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉద‌యం నాటికి మొత్తం టికెట్లు ఎవ‌రెవ‌రికి ఇవ్వాల‌నే విష‌యంపై స్పష్టతకు వస్తారని అంచనా. ఆ వెంట‌నే అభ్యర్థులకు సంకేతాలు పంపి నామినేష‌న్లు వేసుకోవాల‌ని చెబుతార‌ని స‌మాచారం.

Advertisement

Next Story

Most Viewed