హుజురాబాద్‌లో TRS నేతల ‘సూపర్’ ప్లాన్..

by Sridhar Babu |
Eatala-Rajender-Vs-TRS
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న నాయకులు టికెట్ వస్తేనే రంగంలోకి దిగాలన్న యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం సస్పెన్స్‌కు తెర లేపడంతో చివరి క్షణంలో తమకు టికెట్ దక్కకుంటే ఊరు.. వాడా.. తిరిగి లాభం లేకుండా పోతుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత తెరపైకి వస్తున్న నాయకులంతా కూడా తమకు టికెట్ వస్తుందో రాదోనన్న ఆలోచనతోనే వ్యవహరిస్తున్నారు.

పీసీలకు.. ప్రదక్షిణలకే పరిమితం..

హుజురాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు చాలా మంది ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినా ఫైనల్ నిర్ణయం సీఎం కేసీఆర్‌దే కావడంతో ఆయన ప్రాపకం పొందేందుకు కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఆశావాహులు. టికెట్ వస్తే చాలు.. తాము గెలిచినట్టే అన్న ధీమాతో ఉన్న కొంతమంది అప్పుడే గ్రౌండ్ లెవల్‌లో తిరిగి జేబుకు చిల్లు పడేసుకోవడం అవసరమా అన్నట్టుగా ఉంటున్నారు. మరికొంతమంది నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఇంఛార్జీలు, మంత్రుల టూర్ల సమయంలో కనిపిస్తూ తమపై కనికరం చూపకపోతారా అని ఆశిస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు ప్రెస్ మీట్లు పెడుతూ ఈటల రాజేందర్‌పై అటాక్ చేస్తున్నారు.

కానీ, ప్రజల్లోకి వెళ్లి తాము కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకోవడం లేదు. ఈటల రాజేందర్ బలమైన నాయకుడిగా ఉన్నాడన్న విషయాన్ని గమనించిన అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థి ఎంపికపై కసరత్తులు చేస్తోంది. ఈటలను ఢీకొట్టే నాయకుడికి ప్రజల్లో ఎంతో కొంత ఇమేజ్ ఉన్నట్టయితే వారికి పార్టీ బలం, ప్రభుత్వ బలం కూడా చేరుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కూడా ఆశావాహులు మాత్రం ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసేందుకు మాత్రం సాహసించడం లేదు. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ మద్దుతు కూడగట్టే ప్రయత్నం చేయడం కన్నా.. నాయకులు చుట్టు తిరుగుతూ వారి దృష్టిలో పడటమే మేలని భావిస్తుండటంతో నేటికీ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రచారం మాత్రం స్టార్ట్ కాలేదు.

కండువాల దుమ్ముదులిపి..

17 ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈటల రాజేందర్‌ను కాదని టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన నాయకులు ఇంతకాలం హుజురాబాద్‌తో అంతగా సంబంధాలు పెట్టుకోలేదు. అడపాదడపా ఇక్కడ తిరిగిపోయారే తప్ప.. రానున్న కాలంలో తాము టికెట్ రేసులో ఉన్నామన్న పరిస్థితిని కల్పించలేకపోయారు. అనూహ్యంగా ఈటల ఎపిసోడ్ చోటు చేసుకోవడం, ఆయన పార్టీని వీడటంతో తాము రంగంలోకి దిగాలని నిర్ణయించుకుని హుజురాబాద్‌లో తిరుగుతున్నారు. ఇంతకాలం వేరే ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్ర స్థాయి నాయకుల చుట్టూ తిరుగుతూ నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు చేసిన వారంతా.. ఇప్పుడు తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉండే నాయకులు కూడా తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అసలు కారణమిదే..

అయితే, ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ప్రజాక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారి అంతరంగం వేరే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో అధిష్టానం స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతుందన్న నమ్మకం వారిలో బలంగా నాటుకుపోయిందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు బై పోల్స్ జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి సక్సెస్ కావడంతో హుజురాబాద్‌లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. దీనివల్ల తమపై ఆర్థిక భారం కూడా అంతగా పడదని, ఈటల ఓటమి కోసం స్పెషల్ ఆపరేషన్లకు తమ అధినాయకత్వమే శ్రీకారం చుడుతుందన్న ఆశ వారిలో రేకెత్తుతోంది. అటు ఆర్థిక భారం లేకుండా.. ఇటు ప్రచారం కోసం స్కెచ్‌లు వేయకుండానే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని ఊహా లోకాల్లో తేలియాడుతున్నారు.

Advertisement

Next Story