మింగలేక కక్కలేక.. టీఆర్ఎస్ నేతలు

by Shyam |
మింగలేక కక్కలేక.. టీఆర్ఎస్ నేతలు
X

దిశ, న్యూస్ బ్యూరో

పదవులు ఆశించి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వలస వచ్చిన నాయకులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆశించిన పదవులు దక్కకపోవడంతో ఇటు పార్టీలో ఇమడలేక అటు బయటికి పోలేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదవి కోసం నోరెత్తి అగ్రనాయకులను గట్టిగా అడిగే అవకాశం లేదు. అడిగినా పదవి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఏ పదవి దక్కుతుందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎదురుచూపులతోనే కాళం వెళ్ళదీయాల్సి వస్తోంది. అసంతృప్తిని వెళ్ళగక్కితే అసలుకే ఎసరొస్తుందేమోనని భయం. దీంతో ప్రేక్షకులుగానే మిగిలిపోవాల్సి వస్తోంది. గతంలో పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇప్పుడు తెలంగాణ భవన్‌ వైపే కన్నెత్తి చూడడం లేదు.

టీఆర్ఎస్ పార్టీలో చేరితే పదవులు వస్తాయని చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారికి నిరాశే మిగిలింది. దూరపు కొండలు నునుపు సామెత వారికి ఇప్పుడు గుర్తుకొస్తోంది. కనీసం నామినేటెడ్ పోస్టులైనా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పోస్టుల భర్తీ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి తరహాలో ఉండిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కనివారు, పోటీచేసి ఓడిపోయినవారు ఏదో ఒకరకంగా పార్టీలో మెరుగైన అవకాశాలు వస్తాయనుకున్నారు. ఏదో ఒక పోస్టు దక్కుతుందనుకున్నారు. కానీ, ఏవీ వారి దరిచేరలేదు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావులు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కడియం శ్రీహరి తదితర నేతలంగా ఏడాది కాలంగా సైలెంట్‌గా ఉన్నారు. ఏదో ఒక అవకాశం ఎప్పుడో ఒకప్పుడు దక్కకపోతుందా అని ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రావడంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.

మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇటు మంత్రి పదవవి లేక అటు నామినేటెడ్ పోస్టులు దక్కని అసంతృప్తితో రాజ్యసభ యోగమైనా దక్కుతుందేమోనని నమ్మకం పెట్టుకున్నారు. సీనియర్ నేతలు కడియం శ్రీహరికి మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో రెబల్‌గా తన అనుచరులను బరిలో నిలిపారు. ఇక నాయిని నర్సింహారెడ్డి ఒకటి రెండు సార్లు పార్టీ పనితీరు పై ఘాటుగానే విమర్శలు చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నామినేటెడ్ లేదా ఎమ్మెల్సీ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, ఫలితం లేకపోయింది. ఇప్పుడు రాజ్యసభ అవకాశం వస్తుందేమోనని భావిస్తున్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం అలాంటి ఆశ లేదనే అంటున్నారు.

Advertisement

Next Story