ఇమేజ్ డ్యామేజ్.. పోచారం మాట లెక్కచేయని లోకల్ లీడర్లు..!

by Anukaran |
ఇమేజ్ డ్యామేజ్.. పోచారం మాట లెక్కచేయని లోకల్ లీడర్లు..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం ఒక కుటుంబం గోడకూలి దుర్మరణం పాలైంది. అక్కడ డబుల్ బెడ్ రూం కేటాయింపులో వివక్షతో పాటు కాసులు ఇచ్చిన వారికే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. ఇళ్లు లేని నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేటాయించకపోవడంతో వారు తాత్కాలిక గోడలతో నిర్మించిన ఇంట్లో ఉండగా.. ఓ గోడ కూలిపోయి నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం అప్పట్లో కలకలం రేపింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి 10 వేల ఇళ్ళను ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే కట్టిస్తుంటే, అధికార పార్టీకి చెందిన నేతలు అర్హులకు అందకుండా పలువురి నుంచి డబ్బులు వసూల్ చేసి వారికే ఇండ్లను కేటాయిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో పోచారం ఇలాకాలో క్షేత్రస్థాయిలో ఇమేజ్ డ్యామేజీకి అధికార పార్టి నేతలు, ప్రజా ప్రతినిధులు కారణం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. వాటిని అర్హులకు అందజేసేందుకు ఏడాది క్రితం ప్రయత్నాలు షురూ అయ్యాయి. అప్పుడు అనర్హులకు కేటాయిస్తున్నారని స్పీకర్‌కు సమాచారం అందడంతో వాటిని నిలిపివేశారు. కుల సంఘాల వారీగా పేదలను గుర్తించి ఇళ్ళు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా, తర్వాతి క్రమంలో అర్హులకు కేటాయించాలని నిర్ణయించారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి తలెత్తుతోంది.

బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రధాన మండలంగా ఉన్న రుద్రూర్‌లో పేదలకు అందించే డబుల్ బెడ్ రూంల ఎంపిక జాబితాను ప్రజా ప్రతినిధులు తయారు చేసినట్టు మండల కేంద్రంలో చర్చ జరుగుతోంది. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కులాల వారీగా జాబితాను తయారు చేయాలని, వివాదాలకు తావివ్వకుండా అసలైన అర్హులకే డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వాలని ఖరాఖండిగా చెప్పినప్పటికీ ఇక్కడ మాత్రం స్పీకర్ మాటలను లెక్కచేయకుండా.. సుమారు 48 మంది జాబితాను తయారు చేసి అధికారులకు ఇచ్చినట్టు సమాచారం.

గత ఏడాది క్రితం రుద్రూర్‌లో నిర్మించిన 48 డబుల్ బెడ్ రూం ఇండ్లను అనర్హులకు కేటాయించారని, ఒక్కొక్కరి వద్ద సుమారు రూ. 50 వేలు దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో పాటు సరైన ఆధారాలతో సభాపతికి లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో వెంటనే పంపిణీ చేయాల్సిన ఇండ్లను ఆపివేయాలని, అర్హులకు మాత్రమే కేటాయించాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

కానీ, రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇళ్ళ కేటాయింపు బాధ్యతలను తీసుకున్నట్టు సమాచారం. ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోవద్దన్న ఒప్పందంతో తలో 16 ఇండ్ల కేటాయింపుల చొప్పున 48 ఇండ్ల కేటాయింపులతో జాబితాను రూపొందించినట్టు గ్రామంలో అంతా కోడైకూస్తోంది. స్థానిక నాయకులు ఇండ్లను పంచుకుని, తాము చెప్పిన వ్యక్తులకు మాత్రమే ఇండ్లు రావాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. నాయకులే ఈ ఇండ్ల పంపిణీలో చక్రం తిప్పుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి తీరుపై పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వీరి వ్యవహారశైలి సభాపతికి తలనొప్పిగా మారుతుందని రుద్రూర్ మండల ప్రజలు, స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరాకు పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ.. నేతలు చెప్పిన వారికే కేటాయిస్తే అసలైన అర్హులకు అన్యాయం జరగడంతో పాటు అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed