కేసీఆర్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, నేతలు ఫైర్.. సీఎంకు భారీ షాక్ తప్పదా.?

by Anukaran |   ( Updated:2021-08-06 23:24:57.0  )
KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏండ్ల నుంచి గులాబీ జెండా మోస్తున్న ఉద్యమకారులు అగ్గి మండుతున్నారు. ఉద్యమ సమయంలో ‘జై తెలంగాణ’నినాదం ఎత్తుకున్న వారిని పోలీసులతో కొట్టించిన నేతలు మంత్రులయ్యారు. మొన్నటికి మొన్న కౌశిక్​రెడ్డికి గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ కోసం గవర్నర్‌కు ఫైల్​ పంపడం ఇప్పుడు ఉద్యమ నేతలకు రుచించడం లేదు. దీంతో బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. పార్టీలో వెళ్లలేక కొంతమంది వెళ్లిపోగా.. ఎప్పుడైనా ఏదో ఓ అవకాశం దక్కుతుందనే ఆశతో ఇంకా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న నేతలకు నిరాశే మిగులుతున్నది. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారంతా ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండటంపై మండిపడుతున్నారు.

కేసీఆర్​ను ఏమన్నారో..?

“2013, ఏప్రిల్​ 23.. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్​రావు అడుగడుగునా కేసీఆర్​ను విమర్శించారు. బయ్యారం, ఓబుళాపురం గనులు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్​కు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయంటూ ఆరోపించిన దయాకర్​రావు కేసీఆర్​ను తెలంగాణలో తిరుగనీయమంటూ ఫైర్​ అయ్యారు. ఆ తర్వాత 2015, మే 28న నిర్వహించిన మహానాడులో సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు.

దయచేసి సచివాలయంలో ఉండండి.. రైతులను ఆదుకోండి అని, యాగాలకు కేటాయించే సమయంలో కొంచెం రైతులకోసం కేటాయించండి అని వ్యాఖ్యానించారు. సంతలో పశువులును కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. ఇక అప్పటి టీడీపీ నేత తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కూడా కేసీఆర్​పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్​ను హైదరాబాద్​లో తిరగనీయమంటూ సవాల్​ చేశారు. వాళ్లే ఇప్పుడు కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నారు.

ఈటల వరకు అణిచివేతే..

ఉద్యమ సమయంలో గొంగళి పురుగునైనా ముద్దాడుతా అనే నినాదంతో కేసీఆర్​ చాలా మంది నేతలను తన వెంట తిప్పుకొన్నారు. అప్పటికే ఆలే నరేంద్ర ‘తెలంగాణ సాధన సమితి’ పేరుతో పార్టీ పెట్టి ఉద్యమిస్తుండగా, విజయశాంతి ‘తల్లి తెలంగాణ’ పేరుతో పోరాటం చేస్తున్నారు. వీరిద్దరినీ టీఆర్‌ఎస్​లో చేర్చుకొని బయటికి పంపించారనే ప్రచారం ఏండ్ల నుంచే ఉంది. 2004లో ఎమ్మెల్యేలుగా గెలిచిన శనిగరం సంతోష్ రెడ్డి, మందాడి సత్యనారాయణ, కాశిపేట లింగయ్య విసిగిపోయి కాంగ్రెస్​లో చేరారు. మాజీ మంత్రి విజయరామారావు పార్టీ నుంచి వెళ్లిపోయారు.

2004లో వరంగల్ ఎంపీగా గెలిచిన రవీంద్ర నాయక్‌‌ను కేసీఆర్​ తెలంగాణ బంజారా గాంధీని అని ప్రశంసించినా.. టీఆర్ఎస్ ఆఫీసులోనే ఘోరంగా అవమానించారు. పార్టీ ఆఫీసులోకే రానివ్వకుండా అడ్డుకొని దాడి చేయడంతో కేసీఆర్​పై దుమ్మెత్తి పోశారు. కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. అమెరికా నుంచి కేటీఆర్​ రాగానే టికెట్​ అటువైపు వెళ్లింది. మహేందర్​రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చారు. మొదట్నుంచీ మెచ్చుకున్న దేశిని చిన్నమల్లయ్య కూడా కేసీఆర్​ తీరు వల్ల బయటకు వచ్చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి టికెట్ ఇస్తానని తిప్పుకుని మొండిచేయి చూపించడంతో పార్టీ నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే, కేసీఆర్ బంధువు రఘునందన్‌ రావును కూడా పార్టీ నుంచి పంపేశారు. తెలంగాణ కోసం పీడీ యాక్టు కింద జైలుకు వెళ్లిన చెరుకు సుధాకర్‌ది కూడా అదే పరిస్థితి. ఉద్యమంలో కేసీఆర్​కు అండగా ఉన్న గాదె ఇన్నయ్య వీడిపోయారు. దాసోజు శ్రవణ్, రాములు నాయక్​ కూడా అంతే. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రేగులపాటి పాపారావు, సుదర్శన్ రావు కూడా పార్టీకి దూరమయ్యారు. అంతకు ముందు మాజీ ఎంపీ వివేక్​ది అదే పరిస్థితి.

ఇక మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఈటలను అవమానకరంగా గెంటివేశారు. తన కుడి భుజంగా చెప్పుకున్న కేసీఆర్.. భూ అక్రమాల ఆరోపణలతో పంపించారు. ఉద్యమంలో జేఏసీ కీలకపాత్ర పోషించింది. రాజకీయ జేఏసీ చైర్మన్‌గా కోదండరాం చేసిన పోరాటం రాష్ట్రమంతా తెలిసిందే. అంతెందుకు.. కోదండరాంను అప్పటి ఆంధ్రా నేతలు తిడితే అడ్డు నిలబడిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఘోరంగా అవమానించారు. దీంతో ఆయన బయటకు వెళ్లి టీజేఎస్‌ను స్థాపించారు.

ఉద్యమ ద్రోహులకు మాత్రం ఆసనం..

తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీల్లో ఉండి కేసీఆర్​ను, టీఆర్‌ఎస్​ను.. ఉద్యమకారులపై కేసులు పెట్టించిన నేతలు ఇప్పుడు కీలక స్థానాల్లో కూర్చున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో ఎక్కువగా ఉన్నది వాళ్లే. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తో ఉన్న నేతల్లో ప్రస్తుత కేబినెట్‌‌లో ఐదుగురే మిగిలారు. కేటీఆర్, హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, మహమూద్​అలీ, శ్రీనివాస్​గౌడ్ మాత్రమే ఉన్నారు.

మిగితా మంత్రుల్లో ఎక్కువ మంది గతంలో ఇతర పార్టీల్లో ఉండి తెలంగాణ సాధనను వ్యతిరేకించిన వాళ్లే. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్ టీడీపీ నుంచి వచ్చినవారే. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి 2018 ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ ​నుంచి టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. సత్యవతి రాథోడ్ కూడా టీడీపీ నాయకురాలే. వైఎస్సార్​సీపీ నుంచి గెలిచిన పువ్వాడ అజయ్, బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రులయ్యారు.

గతంలో ‘బాల్క’ ఆక్రోషం

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ సమయంలో పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి చాన్స్ రావడంపై టీఆర్‌ఎస్‌లోనే పెద్ద చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఈ విషయంపై బహిరంగంగానే ఆవేదనను వెళ్లగక్కిన విషయం వివాదాస్పదమైంది. ‘కేటీఆర్ చెవులు కొరికి మంత్రివి అయ్యావు’ అంటూ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో వచ్చింది. దీనిపై మరునాడు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది ఆక్రోషంతో చేసిన వ్యాఖ్యాలేనని అంతా భావించారు.

కౌశిక్ వ్యవహారంతో మళ్లీ చర్చ..

కాంగ్రెస్ నేత కౌశిక్ ​రెడ్డిని పార్టీలోకి తీసుకొని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తుండటంతో పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఏండ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న వారికి గౌరవం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్​ పోస్టుల్లో అవకాశం వస్తుందని ఆశపడ్డారు. కానీ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు అందని ద్రాక్షలాగే ఊరిస్తున్నాయి. అటు పార్టీ పదవులు కూడా ఇవ్వడం లేదు.

కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. కొంతమంది నేతలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకునే సమయంలో చాలా మంది వ్యతిరేకించినా గులాబీ బాస్​ వినలేదనే ప్రచారం జరుగుతోంది. ఉదాహరణగా మంత్రి ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకునే సమయంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఎర్రబెల్లికి ప్రియార్టీ ఇస్తూ కడియంను తొక్కి పెడుతున్నారనే వాదన ఉన్నది.

‘దళిత బంధు’పై కేసీఆర్ పక్కా ప్లాన్.. అసెంబ్లీలో కీలక ప్రకటన..?

Advertisement

Next Story

Most Viewed