షాకింగ్ న్యూస్: ఈటలను ఓడించేందుకు కాస్ట్లీ ‘కార్లు’!

by Anukaran |   ( Updated:2021-08-30 00:49:49.0  )
Huzurabad by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల మాటేమిటో కానీ, దేశంలోని ఖరీదైన కార్లన్నీ పల్లెల్లో పరుగులు పెడుతున్నాయి. ఇంతవరకు షేర్​ ఆటోలు తిరిగే రోడ్లపై బెంజ్​, బుల్లెట్​ప్రూఫ్​ కార్లు తిరుగుతున్నాయి. గులాబీ దళాధిపతులు ప్రతినిత్యం ప్రచారంలో పాల్గొంటున్నా.. అది కేవలం చౌరస్తాల వరకే పరిమితం అవుతున్నది. ఆపై లోపలికి వెళ్లిన దాఖలాలే లేవు. ఒకరకంగా చెప్పాలంటే ప్రచారం కంటే ఆర్భాటాలకే ఎక్కువ ఆరాటపడుతున్నారా..? అన్న సందేహాలు ఓటర్లలో కలుగుతున్నాయి. వీరి తీరు ఇలా ఉంటే.. ద్వితీయశ్రేణి నేతలదీ అదే దారి. పైగా కరీంనగర్​, వరంగల్​ నగరాల నుంచి అప్​ అండ్​ డౌన్​ చేస్తున్నారన్న అపవాదు కూడా ఉన్నది. సీఎం కేసీఆర్​ మాత్రం ప్రతి ఇంటికి వెళ్లాలని.. గడప గడపకూ వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించినా.. ఆచరణలో మాత్రం అది కనిపించడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. నేతల కార్ల కాన్వాయ్​పై గ్రామస్థులు మండిపడుతున్నారు. రయ్యిమంటూ దూసుకుపోతున్న వాహనాలతో ఇబ్బందులు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్​ను ఓడించేందుకే ఇంతగా ఆర్భాటం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఓటర్లలో కలుగుతున్నది.

కేసీఆర్‌కు చేరిన కార్ల కథ

హుజూరాబాద్ ​వేదికగా ఎంత చేసినా.. అది అధికార పార్టీకి వ్యతిరేకంగానే మారుతుండటంతో గులాబీ బాస్​ బాధ్యులపై సీరియస్​ అయ్యారు. నాయకులంతా కార్లతో గ్రామాలను ఎందుకు చుట్టుతున్నారని, ఒక్కో నేత ఒక్కో కారులో వెళ్లడమెందుకంటూ కేసీఆర్​ ఘాటుగానే తలంటారని సమాచారం. ఏ నేత కూడా గ్రామాల్లోని ఓటర్ల వరకూ వెళ్లడం లేదని, కూడళ్లలో ఏదో సమావేశం పెట్టి వస్తున్నారంటూ సర్వే నివేదికలతో సహా పేర్కొన్నట్లు తెలిసింది. తమ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలంటే గ్రామాలకు వెళ్లి వారి ఇండ్లలకు వెళ్లాలని.. ఎవరూ ఓటర్ల ఇంటి తలుపు తట్టడం లేదని, ఇకనైనా దాన్ని పాటించాలంటూ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై హరీశ్​రావు కూడా నేతలకు వివరించినా.. తమ హుందాతనాన్ని చూపించుకోవడంతోపాటు సౌకర్యం కోసం ద్వితీయ శ్రేణి నేతలు కార్లను వదిలి వెళ్లడం లేదు. హుజూరాబాద్‌లో ఇప్పుడు గులాబీ దళానికి కార్లతోనే గండం ఏర్పడిందా? అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

పెరుగుతున్న వ్యతిరేకత

హుజూరాబాద్​ కేంద్ర బిందువుగా అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలు ఓటర్లలో అనుకూలం కంటే వ్యతిరేకతను ఎక్కువగా తెచ్చి పెడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దళిత బంధు కలిసి రావడం లేదు. దీనిపై గులాబీ బాస్ ​నుంచి మొదలుకుని స్థానిక నేతల వరకు సర్కస్​ ఫీట్లు చేయాల్సి వస్తున్నది. కేవలం ఈటల రాజేందర్‌ను దెబ్బకొట్టేందుకు నిధులు, నియామకాలన్నీ ఆ సెగ్మెంట్​కు తరలాయి. ఇతర పార్టీల నేతలను పిలిచి మరీ పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా ఊరూరా నిధుల వరద పారిస్తున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయి నేతలందరినీ హుజూరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలంతా అక్కడే మకాం వేశారు. కులాల వారీగా సమీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కోక్కరు ఒక్కో కారులో గ్రామాలకు వెళ్తున్నారు. రెండు, మూడు గ్రూపులుగా వెళ్లి తమ కులాలు, వర్గీయులతో సమావేశమవుతున్నారు. ఇదే అధికార పార్టీకి మరింత బెడిసికొడుతోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, కేబినెట్ హోదా ఉన్న వారు, వారి అనుచరుల కార్లు గ్రామాల్లో సందడి చేస్తున్నాయి. ఇది గ్రామాల్లో ప్రధాన చర్చకు దారి తీస్తున్నది. గతంలో లేని విధంగా ఖరీదైన కార్లలో వెళ్తున్న అధికార పార్టీ నేతలను చూసి కిందిస్థాయి వర్గాల్లో ఈటలకు మరింత సానుభూతి పెరుగుతున్నది. ఈటల రాజేందర్​ను ఓడించేందుకు ఇంత మంది ఇన్ని కార్లలో వస్తున్నారంటూ అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచుతున్నది. దీనికి తోడుగా బీజేపీ సోషల్​ మీడియా కూడా టీఆర్​ఎస్​ ఖరీదైన ప్రచారాన్ని విస్తృత ప్రచారం చేస్తున్నది. సోషల్​ మీడియాతో పాటు గ్రామస్థాయిలోని పలు వర్గాలకు ఇదే అంశంగా ప్రచారాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు నిధుల వరద కురుస్తున్నది. దీంతో ఆ సెగ్మెంట్​కు చెందిన అనేక మంది నేతలు కొత్తగా కార్లు కొనుగోలు చేశారు. కొన్ని గ్రామాల సర్పంచ్​లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సొంతంగా కొనుగోలు చేసిన కార్లలో వెళ్లడం మరింత చర్చగా మారింది. ఎన్నికల వరకైనా ద్వితీయ శ్రేణి నేతలు కొంత ఓపికగా ఉండాలంటూ పార్టీ నుంచి సలహా ఇస్తున్నారు. కానీ దీన్ని కూడా ఎవరూ పాటించడం లేదంటున్నారు. ఇది పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed