- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG Politics ‘స్థానికం’పై అన్ని పార్టీల ఫోకస్.. పంచాయతీల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా విజయం సులువు అవుతుందని భావిస్తున్నాయి. అందుకోసం కేడర్‌ను సన్నద్ధం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించాలని అధికార పార్టీ, కేంద్రం చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రానికి అందజేస్తున్న సహాయసహకారాలు, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని బీజేపీ, రాష్ట్ర సర్కారు వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు బీఆర్ఎస్, ప్రజాసమస్యలపై పోరాట పంథాను ఎంచుకొని ముందుకెళ్లాలని స్థానికంలో గట్టెక్కాలని కామ్రేడ్లు వ్యూహాలను రచించుకుంటున్నారు.
అంశాల వారీగా ప్రణాళికల రూపకల్పన
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తే త్వరలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించొచ్చని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసం కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. నాయకులు, కేడర్‌కు సైతం పార్టీ కార్యక్రమాలు ఇస్తే వారు పార్టీ మారకుండా ఉండటంతో పాటు పార్టీని యాక్టివ్ చేయొచ్చని పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు సీపీఐ, సీపీఎంలు సైతం ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి. పార్టీ కేడర్‌కు ఎలాంటి సూచనలు ఇవ్వాలి.. ప్రజల ముందుకు ఏయే అంశాలతో వెళ్తే సక్సెస్ అవుతామో అనే వాటిపైనే ప్రధాన ఫోకస్ పెట్టి అంశాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నూరు శాతం లక్ష్యంతో కాంగ్రెస్
రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌కు పటిష్టమైన కేడర్ ఉంది. కొంత ద్వితీయశ్రేణి నాయకులతో కార్యకర్తలకు గ్యాప్ ఉండటంతో వాటిని పూడ్చేపనిలో ఇన్‌చార్జీలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జూమ్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు గాంధీభవన్ వేదికగా స్థానిక ఎన్నికలకు సన్నద్ధంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే జిల్లాలవారీగా నేతలతో సమీక్షా సమావేశాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలను ఇవ్వనున్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే పీసీసీ చీఫ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జడ్పీ స్థానాలపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గతానికి భిన్నంగా అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకునే వ్యూహాలను రచిస్తున్నారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్, ధాన్యానికి రూ.500 బోనస్, ఉద్యోగాల భర్తీ, భూభారతి.. వంటి అంశాలతో పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సర్కారు భావిస్తోంది. ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇప్పటికే స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారని, ఇతర నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలకు ప్రణాళికను వివరించి రంగంలోకి దింపుతారని పార్టీ వర్గాల సమాచారం.
పట్టు కోసం బీజేపీ స్కెచ్
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో కేడర్‌లో జోష్ ఉంది. రాబోయే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. అందుకు రాష్ట్రంలో స్థానికంగా బలోపేతం కావాలని వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నెల 5 లోపు మండల కమిటీలు, సంక్రాంతి వరకు జిల్లా కమిటీలు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేపట్టాలని భావిస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. దీనిని అనువుగా మల్చుకోవాలని, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని ఇప్పటికే పార్టీ లీడర్లు, కార్యకర్తలకు సైతం ఆదేశాలిచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన నిధులు, విద్యాసంస్థలు, ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల కోసం చేసిన కృషి, వివరించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వహామీలు, వైఫల్యాలు వివరించాలని భావిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేశాయని వివరించేందుకు అంశాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పార్టీ లీడర్లు తెలిపారు.
పట్టు కోల్పోకుండా బీఆర్ఎస్ వ్యూహం
గ్రామపంచాతీయల్లో 85 శాతానికి పైగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలను మెజార్టీ స్థానాల్లో, రాష్ట్రంలోని అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితం అయి అధికారం కోల్పోవడం, పార్లమెంటులో ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోకపోవడంతో కేడర్‌లో నైరాశ్యం ఉంది. కాగా, కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. త్వరలో పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీలు వేస్తామని, యాక్టివ్‌గా పనిచేసేవారికి కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు కవిత బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. హరీశ్‌రావు సైతం నిత్యం ఏదో నియోజకవర్గ పర్యటన చేస్తూ కేడర్‌ను యాక్టివ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో మాదిరిగానే మళ్లీ మెజార్టీ ‘స్థానిక’ స్థానాల్లో పాగా వేసేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
‘స్థానిక’ సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి కామ్రేడ్లు
స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రజల మధ్యలోని వెళ్లేందుకు సీపీఎం, సీపీఐ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తుతో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీపీఐ తన ఖాతాలో వేసుకుంది. అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించింది. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం సైతం చేశారు. అయితే, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా? ఒంటరిగానే బరిలో దిగుతుందా? అనేది క్లారిటీ రాలేదు. కానీ, పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో కేడర్‌ను సమాయత్తం చేసే పనిలో అధిష్టానం నిమగ్నమైంది. సీపీఎం సైతం ప్రజాసమస్యలపై గళమెత్తి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకునేందుకు సిద్ధమవుతోంది. స్థానిక ఎన్నికల్లో బలం పుంజుకుంటే రాబోయే ఏ ఎన్నికల్లోనైనా ఏ పార్టీ తోనైనా పొత్తు పెట్టుకోవచ్చిని, ఆయా పార్టీలు మద్దతు కోసం వస్తాయని నేతలు భావిస్తున్నారు.
మూడు పార్టీల మధ్యే పోటీ!
ఇప్పటికే స్థానిక ఎన్నికలపై ఎన్నికల కమిషన్ సైతం యాక్టివ్ కావడంతో త్వరలోనే ఎలక్షన్స్ వస్తాయని భావిస్తూ పార్టీలన్నీ అందుకోసం ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమవుతున్నాయి. అయితే, ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడుపార్టీల మధ్య పోటీ ఉండటంతో ఏ పార్టీ సత్తా చాటుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మెజార్టీ స్థానాల్లో పాగా వేయడం ఆనవాయితీ. కాగా, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు ఎవరికి అనుకూలంగా మారుతాయో చూడాలి.