వారివల్లే హుజురాబాద్‌లో ఓడిపోయాం.. సమ్మిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sridhar Babu |   ( Updated:2021-11-06 05:15:30.0  )
TRS leader Tummeti Sammi Reddy
X

దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల వైఫల్యంతోనే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచాడని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరుగురు మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేసినా, స్థానిక నాయకుల సమన్వయ లోపంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారని అన్నారు. 2023లో హుజురాబాద్‌లో తమ సత్తా చాటుతామని, ఎమ్మెల్యేగా గెలవగానే అధికారం తమదే అన్న ధీమాతో గ్రామాల్లో బీజేపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎమ్మెల్యే ఈటల జోక్యం చేసుకొని హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని సూచించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటామని, ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. లక్షా 60 వేల పైచిలుకు ఓటు బ్యాంకు ఉన్నా, వాటిని టీఆర్ఎస్ వైపు మలుచుకోవడంలో వైఫల్యం జరిగిందని అన్నారు. ప్రగతిభవన్‌లో కండువాలు కప్పుకున్న నాయకులతోనే తీవ్రనష్టం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించి ఇంటి దొంగలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed