- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ అవినీతిపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు తోడేళ్లలాగా ప్రజలను పట్టి పీడిస్తున్నాయని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అబద్ధాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, ప్రజల జేబుకు చిల్లు పెట్టారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రంలో అధికారం వస్తుందనే భ్రమలో ఉన్నారని, వారు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా అని ప్రశ్నించారు. వారు పేదల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో మోడీ సర్కార్ అట్టర్ ప్లాప్ అయ్యిందని, తమకే నీతులు చెప్పబోతే ఎలా అంటూ దుయ్యబట్టారు. ఎస్సీ అసైన్డ్ భూముల్ని తీసుకున్నానని ఈటల రాజేందర్ స్వయంగా ఒప్పుకున్నారని, అలాంటి వ్యక్తిని బీజేపీలో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని అన్నారు.
రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడే భాష హుందాగా ఉండాలి కానీ, జుగుప్సాకరంగా మాట్లాడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసిందేమీ లేదని, ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నూరుశాతం తెలంగాణలో సామాజిక న్యాయం అమలవుతోందని, 1 లక్ష 38 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ తప్ప వేరే ఆలోచే లేదని పేర్కొన్నారు. మతోన్మాదంతో బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని, శాంతియుతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే భంగపాటు తప్పదని హెచ్చరించారు. మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జోస్యం చెప్పారు. నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొంతమంది కాంట్రాక్టర్ల దగ్గర చందాలు అడుగుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చార్మినార్‌ను అమ్మేస్తారని ఆరోపించారు. ఇలాంటి వారి మాటలతో ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణపాడి పంటలతో తులతూగుతోందని, హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని ఆశాభావం వ్యక్తం చేశారు.