ఈటల మార్క్.. మల్లగుల్లాలు పడుతున్న కార్ టీమ్!

by Anukaran |
huzurabad by election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అప్రతిహతంగా విజయాల పరంపర కొనాసాగిస్తున్న ఆ పార్టీకి అక్కడ అభ్యర్థులు కరువయ్యారు. ధీటైన నాయకుని కోసం అధి నాయకత్వం అన్వేషణ మొదలు పెట్టింది. స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత టీఆర్ఎస్ పార్టీ వరస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గులాబీ నాయకులకు ఇప్పుడో సమస్య వచ్చి పడింది. అధినేత ప్రత్యక్ష్యంగా పర్యవేక్షణ చేస్తున్నా.. అభ్యర్థి మాత్రం దొరకడం లేదు. దీంతో టీఆర్ఎస్ ఎవరిని బరిలో నిలుపుతుందోనన్న చర్చ తీవ్రంగా సాగుతుంటే… అధికార పార్టీ మాత్రం అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడాల్సి రావడం ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తయారైంది.

ముప్పతిప్పలు పెడుతోన్న ఈటల మార్క్

హుజురాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేయడం దాదాపుగా ఖాయం అయిపోయింది. అయితే ఆయన మొదటి నుండి వేసుకుంటూ వచ్చిన ఎత్తులతో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ఆరా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈటల తన నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేకుండా చేశాడన్న వాదన కొందరిదైతే… ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు పెట్టుకోవడం కూడా లభిస్తోంది అనేది మరి కొందరి అంచనా. 17 ఏళ్లుగా హుజురాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న రాజేందర్ ను ఓడించే సత్తా ఉన్న నాయకులే పార్టీలో లేకపోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

బలమైన సామాజిక వర్గంతో పాటు గెలుపు గుర్రం అయితే బావుంటుందని భావిస్తున్నప్పటికీ స్థానికంగా అలాంటి నాయకులే లేకపోవడం విచిత్రమనే చెప్పాలి. ఉప ఎన్నికల్లో అంతిమ విజయం తమదేనన్న ధీమాతో టీఆర్ఎస్ నాయకులు ఉన్నా థీటైన అభ్యర్థి లేకపోవడం తీరని లోటుగానే భావించాలి. హుజూర్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మావతిపై సైదిరెడ్డిచే పోటీ చేయించి విజయం సాధించినా, సాగర్ ఎన్నికల్లో నోముల తనయుడు భరత్ ను బరిలో నిలిపి సక్సెస్ అయినా హుజురాబాద్ విషయానికి వస్తే మాత్రం గట్టి పోటీనిచ్చే వ్యక్తి కోసం వెతుక్కోవల్సిన పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.

ఆరా తీయిస్తున్న కేసీఆర్..

హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్ బలమైన అభ్యర్థుల వివరాలు సేకరించే పనిని నిఘా వర్గాలకు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో ఈటలను ఢీ కొట్టే స్థాయిలో నాయకుడు కనిపించకపోవడంతో ఇతర పార్టీల వైపు కూడా దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పేరును పరిశీలించింది. పద్మాశాలీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడంతో బలమైన అభ్యర్థిగా రమణ ఉంటాడని భావించారు. కానీ ఆయన అక్కడి నుండి పోటీ చేసేందుకు విముఖత చూపడం, ఇంకా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోకపోవడంతో మరో అభ్యర్థి వేటలో టీఆర్ఎస్ అధిష్టానం పడింది.

తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి గురించి కూడా ఆరా తీశారు. ఆయనను బరిలో నిలిపితే ఎలా ఉంటుందనే లెక్కలు కడుతున్నారు. ఆయన సోదరుడు దామోదర్ రెడ్డి కమలాపూర్ నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించిన విషయాన్ని గమనించి ఆయనకు అవకాశం కల్పిస్తే కలిసొస్తుందేమో అనే ఆలోచనలో అధినేత కేసీఆర్ ఉన్నారు. ఈ మేరకు పురుషోత్తం రెడ్డి పోటీ చేస్తే అక్కడి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందోనని కూడా ఆరా తీయిస్తున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు భార్య సరోజనమ్మ, వొడితెల రాజేశ్వర్ రావు మనవడు ప్రణవ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు కశ్యప రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యడు వకుళాభరణ కృష్ణమోహన్ ల పేర్లను పరిశీలించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు జమ్మికుంటకు చెందిన అరుకాల వీరేశలింగం, పొనుగంటి మల్లయ్యల పేర్లు కూడా పరిశీలించినప్పటికీ ఫైనల్ డెసిషన్ కు మాత్రం రాలేదని సమాచారం.

అల్గిరెడ్డికి అవకాశం..?

హుస్నాబాద్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ముల్కనూరు కేంద్రంగా నిర్వహిస్తున్న సహకార బ్యాంకుతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని, ఈ సారి హుజురాబాద్ నుండి ఆయనకు అవకాశం ఇచ్చి వచ్చే సాధరణ ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డిని హుస్నాబాద్, సతీష్ బాబుకు హుజురాబాద్ నుండి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్ రెడ్డి వల్ల అటు రైతాంగం కూడా పార్టీకి అండగా నిలిచే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

పొన్నం వంతు…

తాజాగా కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. బీసీ కార్డు బలంగా వినిపించే అవకాశ ఉన్న పొన్నం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా హుజురాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే పొన్నంకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు కూడా లాభిస్తుందన్న కారణంతో ఆయనను టీఆర్ఎస్ లో జాయిన్ చేసుకునే భారీ స్కెచ్ లో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు రెండు రోజులుగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

వెధవల ప్రచారం: పొన్నం

తాను టీఆర్ఎస్ పార్టీ నుండి హుజురాబాద్ లో పోటీ చేస్తానన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని పొన్నం ప్రభాకర్ ’దిశ‘ తో స్పష్టం చేశారు. కొంతమంది వెధవలు కావాలని తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు టీఆర్ఎస్ లో చేరే ఆలోచనే లేదని అన్నారు.

Next Story

Most Viewed