ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సర్కార్.. ఒకే రోజు రెండు దెబ్బలు..?

by Sridhar Babu |   ( Updated:2021-12-07 10:19:37.0  )
ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సర్కార్.. ఒకే రోజు రెండు దెబ్బలు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బైపోల్స్‌లో విజయం సాధించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సాధించే దిశగా ముందుకు సాగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ముప్పేట దాడి స్టార్ట్ అయిందా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపకుండా ఉండేందుకు సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందా..? ఒకే రోజు చోటు చేసుకున్న రెండు పరిణామాలను గమనిస్తే ఇదే అనుమానం కలుగుతోంది. 8 నెలల కిందట అసైన్డ్ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈటల పార్టీని వీడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూముల విషయమే ప్రధాన ఎజెండాగా తీసుకుని అధికార టీఆర్ఎస్ పార్టీ బై పోల్స్‌లో ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు దాటిన తర్వాత ఈటలపై అటాక్ స్టార్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఒకే రోజున…

ఒకే రోజున రెండు విధాలుగా రాజేందర్ పై సర్కారు అటాక్ చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట, అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 70.33 ఎకరాల భూములు అసైన్డ్ వేనని తేల్చారు. మెదక్ కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించిన తరువాత జమున హ్యాచరీస్ యజమాని ఈటల రాజేందర్ భార్య జమున మీడియాతో మాట్లాడుతూ… తమకు ఉన్నవే 60 ఎకరాలని 70.33 ఎకరాలు ఆక్రమించుకున్నట్టు ఎలా తేల్చారంటూ ప్రశ్నించారు. ఇందుకు కౌంటర్‌గా కలెక్టర్ కూడా మంగళవారం మీడియాకు పూర్తి వివరాలను విడుదల చేశారు. మరో వైపున సోమవారం నాడే కరీంనగర్ త్రీ టౌన్ సీఐ దామోదర్ రెడ్డి ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల్లో విజయం తరువాత కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను విచారణకు హాజరు కావాలని ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేశారు.

ఎత్తుగడలేంటో..?

ఎన్నికల్లో విజయం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న రాజేందర్ రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్నారు. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో కేంద్ర బిందువుగా కూడా మారాడు. మరో వైపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనవంతు వ్యూహం అమలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బరిలో నిల్చున్న అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి చివరి నిమిషంలో ఒకే అభ్యర్థిని ప్రకటించి అతనికే మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎత్తుగడతో ముందుకు సాగుతోందా అన్న చర్చ సాగుతోంది. ఈటలను చక్రబంధంలో ఇరికించినట్టయితే పార్టీ వ్యూహానికి ఎలాంటి అడ్డంకి లేకుండా ఉంటుందన్న అంచనాతోనే ముప్పేట దాడులు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed