- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరగలేనంటున్న వాణీదేవి… ఎమ్మెల్యేలకు టార్గెట్ టెన్షన్
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇందుకోసం అన్ని అస్త్రాలనూ సిద్ధం చేసుకుంటోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ తదితర టీఆర్ఎస్ నేతలందరితో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి తనకున్న పరిస్థితుల రీత్యా మూడు జిల్లాల్లోనూ తిరగడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులమీదనే భారం వేస్తోంది అధిష్ఠానం. ప్రతీ యాభై మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి చొప్పున నియమించాలనుకుంటోంది. గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధుల మీదనే పెట్టేలా కేటీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసి వర్క్ డివిజన్ చేయనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు జిల్లాల్లో బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వాణీదేవిని అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు పోటీ చేస్తుండడంతో ఆయనను ఢీకొట్టడానికి అదే సామాజికవర్గానికి చెందిన వాణీదేవిని ఖరారు చేసింది. ఇద్దరూ ‘కరణం’లే. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి పీవీ కుమార్తె అనే ఇమేజ్ కూడా పనికొస్తుందని టీఆర్ఎస్ మాస్టర్ స్ట్రోక్‌తోనే ఆమెను అభ్యర్థిగా ఖరారు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా పోటీచేస్తున్నవారు కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ కాస్త ఆలస్యంగానే రంగంలోకి దిగింది. ఈ లోపం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించకుండా క్షేత్రస్థాయి నుంచే చక్కదిద్దాలనుకుంటోంది.
ఆ జిల్లా ప్రతినిధులతో ప్రత్యేక సెషన్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పరిస్థితికి భిన్నమైన వాతావరణం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంటున్న దృష్ట్యా ఆ జిల్లా ప్రజా ప్రతినిధులతో మధ్యాహ్నం తర్వాత కేటీఆర్ ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నారు. ఆ జిల్లా స్థానికుడైన కాంగ్రెస్‌కు చెందిన చిన్నారెడ్డి పోటీ చేస్తుండడంతో అక్కడ ఓట్లలో వచ్చే చీలిక నిర్ణయాత్మకంగా ఉంటుందని పార్టీ అభిప్రాయం. అందువల్లనే ఆ జిల్లా నేతలంతా పక్కా సమన్వయంతో ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు అవలంబించాల్సిన వ్యూహాన్ని వివరించనున్నారు.
గత వైఫల్యాలను అధిగమించేలా..
ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులతో పాటు కొత్తగా చేరినవారిని కూడా క్యాంపెయిన్‌లో కలుపుకునిపోయి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నమ్మకమైన డివిజన్లలో వైఫల్యం రావడానికి కారణాలను విశ్లేషించి ఇప్పుడు వాటిని అధిగమించేలా గ్రాడ్యుయేట్ ఓటర్లను టార్గెట్ చేయాలనుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించడానికి ప్రత్యేకంగా క్యాంపెయిన్‌లనే చేపట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఊహకు అందని విధంగా గణనీయ సంఖ్యలో కొత్త పట్టభద్రులు ఓటర్లుగా చేరడంతో ఇప్పుడు అదే వారికి భారంగా మారింది. పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వారిని ఆకట్టుకోడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని, నమ్మకాన్ని కల్గించాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో కేటీఆర్ వివరించే అవకాశం ఉంది.