టీపీసీసీ కోసం టీఆర్ఎస్-బీజేపీ ఆసక్తి..!

by Anukaran |
టీపీసీసీ కోసం టీఆర్ఎస్-బీజేపీ ఆసక్తి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ అంశంపై పరిణామాలు రోజుకో తీరు మారుతున్నాయి. కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎవరికి వస్తుందనేది ఆ పార్టీలో కంటే పక్క పార్టీల్లోనే ఎక్కువ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల్లో టీపీసీసీ చీఫ్ అంశమే ప్రధానంగా మారింది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌లో వ్యతిరేక వర్గాలపై కన్నేశాయి. పార్టీలోకి నేతలను తీసుకురావాలని బీజేపీ చూస్తుంటే.. కాంగ్రెస్‌లో కోవర్టులుగా ఎలా మార్చుకోవాలనే అంశంపై టీఆర్‌ఎస్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీపీసీసీ చీఫ్ అంశం పార్టీల్లో ఉత్కంఠకు దారి తీస్తోంది.

నెక్ట్స్​ఎవరు మరి?

టీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోనే కోవర్టులున్నట్లు ప్రచారంలో ఉన్న విషయమే. దీనిపై గతంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి పలుమార్లు బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్ర నాయకత్వంలోనే చాలా మంది అధికార పార్టీకి అండగా ఉన్నారని, కోవర్టులుగా మారి అమ్ముడు పోయారని, అలాంటి వారు ఉండటంతోనే పార్టీ నాశనమవుతోందంటూ ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్​కూడా కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసినట్లు గతంలోనే స్పష్టమైంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను సైతం గులాబీ ఆకర్ష్‌లో రప్పించుకున్నారు. నేతల మధ్య విభేదాలను సీఎం కేసీఆర్ సృష్టించారనే ప్రచారం జరిగింది. కొంతమంది పార్టీ నేతలను సీఎం కోవర్టులుగా చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మారుతోంది.

ఉత్తమ్​ రాజీనామా అనంతరం టీపీసీసీ చీఫ్ మార్పు అనివార్యమైంది. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ఢిల్లీ అధిష్ఠానం దగ్గర ఫైల్ ఉంది. ఇప్పుడు, అప్పుడో టీపీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే కొత్త నాయకత్వంలో ఎవరిని మళ్లీ కోవర్టులుగా చేసుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రాష్ట్ర నాయకత్వం అంశాలన్నీ టీఆర్‌ఎస్‌కు చేరవేయడం, పార్టీలో అధికార పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడితే వారితో విభేదించినట్లుగా మాట్లాడే నేతలను వెతుకులాడే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎవరికి వస్తుందో.. వారి వెనక ఉండే నాయకులెవ్వరో, వారిని ఎలా బుట్టలో పడేయాలనే ప్లాన్​చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్​ప్రకటన వచ్చిన తర్వాత గులాబీ బాస్​ఈ అంశంపైనే ఉంటారని కూడా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

వచ్చే వారెవ్వరూ..?

మరోవైపు బీజేపీ రాష్ట్రంలో దూకుడు మీదుంది. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో కాషాయదళం ఇతర పార్టీ నేతలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మండలి మాజీ చైర్మన్​స్వామిగౌడ్ బీజేపీలో చేరడంతో ఇంకా కొంతమంది టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మాజీ మంత్రులు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ నుంచి మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం పటిష్టంగా లేకపోవడంతోనే పార్టీ మారుతున్నట్లు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో రేవంత్​రెడ్డికి టీపీసీసీ ఇస్తే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డితో పాటు పలువురు నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వెంకట్​రెడ్డికి టీపీసీసీ అవకాశం వస్తే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా కాషాయం కండువా కప్పుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ నేతలు కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. రేవంత్​రెడ్డికి పగ్గాలు ఇస్తే ఆయా జిల్లాల నుంచి కూడా రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకట్​రెడ్డి‌కి వస్తే మాత్రం రేవంత్​రెడ్డితో సహా చాలా మంది సీనియర్లకు వల వేస్తున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఎవరికి వస్తుందనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో కంటే ఇతర పార్టీల్లోనే ఎక్కువ ఆసక్తి కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed