మంత్రి పువ్వాడకు బిగ్ షాక్.. కార్యకర్తలు ఎందుకు అలా చేశారు ?

by Sridhar Babu |   ( Updated:2021-12-29 03:13:55.0  )
మంత్రి పువ్వాడకు బిగ్ షాక్.. కార్యకర్తలు ఎందుకు అలా చేశారు ?
X

దిశ, భద్రాచలం : పరిస్థితులు మారినా, పదవులు చేజారిన మేమంతా బాలసాని లక్ష్మీనారాయణ వెంటే ఉంటామని చర్ల మండల టీఆర్ఎస్ నాయకులు పలువురు మరోమారు స్పష్టం చేశారు. భద్రాచలంలో బుధవారం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటన ఉన్నప్పటికీ, మంత్రిని కలిసేందుకు వెళ్ళకుండా భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో జరిగిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పర్యటనకు హాజరవడం చర్చనీయాంశమైంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని మరోమారు తేటతెల్లమైంది. గ్రూపులకు నిలయమైన చర్ల మండలంలోని టీఆర్ఎస్ నాయకులు వర్గాలుగా విడిపోయి కొందరు భద్రాచలం వెళ్ళగా, మరికొందరు వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్ళి అధినేతల వద్ద గురుభక్తి చాటుకున్నట్లుగా సమాచారం.

బాలసాని వర్గీయులుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ చర్ల మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్,సర్పంచ్ నాగేంద్రబాబు, నాయకులు సయ్యద్ అజీజ్, ముమ్మినేని అరవింద్, పోలిన లంక రాజు, కొటేరు శ్రీనివాసరెడ్డి, దొడ్డి తాతారావు, పోట్రు బ్రహ్మానందరెడ్డి, పెన్మెత్స సీతాపతి రాజు, తోటమల్ల వరప్రసాద్, పంజా రాజు, తోటమల్ల రవి తదితరులు చర్ల నుంచి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి ములుగు జిల్లాలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పర్యటనకు వెళ్లారు. జనవరి 4న బాలసాని ఎమ్మెల్సీ పదవి గడువు ముగియనుంది. కొద్దిరోజుల్లో బాలసాని పదవి ముగియనున్న నేపథ్యంలో ఆయన బలగమంతా బుధవారం జరిగిన అధికారిక కార్యక్రమాలకు హాజరై బలప్రదర్శన చేసినట్లుగా తెలుస్తోంది. బాలసాని పర్యటనకు వెళుతూ టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం మండల అధ్యక్షులు తిరుపతిరావులతో కలిసి చర్ల నాయకులు ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా అది వైరల్‌గా మారి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story