కరోనా వేళ.. భేదాలు వద్దు

by Sujitha Rachapalli |   ( Updated:2020-07-14 05:50:43.0  )
కరోనా వేళ.. భేదాలు వద్దు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆరేడు నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ కేసులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. పసిపాపల నుంచి శతాధిక వృద్ధుల వరకు, దేశాధ్యక్షుల నుంచి దొంగ బాబాల వరకు ఎవరినీ వదలకుండా కరోనా కమ్మేస్తోంది. ఈ క్రమంలోనే.. భారత్‌లోనూ ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అందులో ఢిల్లీ, ముంబై, తమిళనాడుల్లో కేసులు మరింత ఉధృతంగా ఉన్నాయి. మొదటి నుంచి ముంబై మహానగరాన్ని కరోనా తన గుప్పిట్లో పెట్టుకుంది. అయినా.. ముంబై మురికివాడ ‘ధారావి’లో మాత్రం ముంబై అధికారులు చూపిన శ్రద్ధ, జాగ్రత్తలతో.. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకున్నారు. మన దేశానికే ఆదర్శంగా నిలిచేలా ధారావి నిలిచింది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే కరోనాపై ధారావి విజయం సాధించడంపై ప్రశంసలు కురిపించింది. కానీ.. ధారావి దాటి.. కరోనా ముంబై వీధుల్లో వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో పాటు, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా సోకింది. అయితే.. ఇక్కడ అసలు చిక్కు వచ్చి పడింది. తమ ఆరాధ్య నటుడికి.. కరోనా సోకడంతో.. ఎంతోమంది అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.. కొన్ని లక్షల మందికి కరోనా సోకినప్పుడు.. ప్రార్థనలు చేయలేరు కానీ.. ఇప్పుడు ఓ సినీ నటుడికి కరోనా రావడంతో… ప్రార్థనలు, పూజలు చేయడం ఏంటని ఆన్‌లైన్‌ వేదికగా ఎంతోమంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటంతో ఆయన అభిమానులు బిగ్‌బీ ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు. ఆయనకు త్వరగా నయం కావాలంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఉపవాసాలు కూడా చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ఓ అభిమాని అయితే ఏకంగా అమితాబ్‌కు గుడి కట్టించాడు. అంతేకాదు తన షాప్‌కు కూడా అమితాబ్ పేరు పెట్టుకున్నాడు. ఆదివారం ఉజ్జయిని ఆలయం లో ప్రత్యేక పూజలు కూడా మొదలుపెట్టారు . అలాగే ముంబైలోని కండ్వాలీ ప్రాంతంలో ఉన్న మిథిలా హనుమాన్ ఆలయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోసం మహా మృత్యుంజయ హోమం జరిపించారు అభిమానులు. అంతేకాదు ముంబైలో డబ్బావాలాలు ఎంత పాపులర్ అందరికీ తెలిసిందే. వాళ్లు కూడా అమితాబ్ త్వరగా కోలుకోవాలని ముంబైలోని వందలాది మంది డ‌బ్బావాలాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా లక్షలాది అమితాబ్ అభిమానులు తమకు తోచిన రీతిలో పూజలు చేస్తున్నారు. అయితే అభిమానులకు తమ హీరో క్షేమంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు.. అయితే.. కరోనా వల్ల ఎంతోమంది వలస కూలీలు ఎలాంటి అవస్థలు పడ్డారో అందరూ కళ్లారా చూశారు. కొద్ది మంది మానవతా హృదయుల్ని విడిచిపెడితే… వారి గోడు పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఇప్పటికీ పనుల్లేక వలస కూలీలు దుర్భర జీవితం సాగిస్తున్నారని వారి గురించి ఏనాడు ఆలోచించలేదంటూ.. పేదల పట్ల ఒకలా.. సెలెబ్రిటీలపై మరోలా ప్రేమ కురిపించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నిజమే :

కరోనాతో యావత్ దేశ ప్రజలు భయపడుతున్న ప్రస్తుత తరుణంలో.. సెలెబ్రిటీలు.. సామాన్యులు అనే తేడాను పక్కనపెట్టి.. మనిషికి మనిషి సాయం చేసుకోవాల్సిన సందర్భం ఇది. కరోనా వస్తే.. ఊరిలోకి రానియ్యడం లేదు. కరోనా అని తెలిస్తే.. ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. ఇక కరోనాతో చనిపోతే.. వారి అంతిమ సంస్కారం ఎంత దారుణంగా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కరోనా వచ్చిన పేదల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అటు సర్కారు కానీ.. ఇటు సాటి మనుషుల కానీ.. కరోనా వల్ల పేదల పడుతున్న ఇబ్బందులపై ఎవరికీ పట్టింపు లేదన్నది నెటిజన్ల ఆవేదన. పేదలను మనుషులుగా కూడా గుర్తించడం లేదని వారు వాపోతున్నారు. కరోనాకే సెలెబ్రిటీ.. సాధారణ పౌరుడు అనే.. బేధాలు లేనప్పుడు .. తోటి మనుషులకు ఎందుకు ఉండాలన్నది వారి వాదన. సో.. అందరి గురించి ప్రార్థించాలి. అందరూ బాగుండాలి. కరోనా మహామ్మారి త్వరగా ఈ లోకాన్ని వీడిపోవాలని అందరం కోరుకుందాం. ఆరోగ్యంగా ఉందా. తోటి మనుషులకు బతకడానికి..ధైర్యనిద్దాం. చేతనైనా సాయం చేద్దాం. మానవత్వాన్ని బతికించుకుందాం. కోవిడ్‌పై కలిసి పోరాడుదాం.

Advertisement

Next Story